హైదరాబాద్, వెలుగు: బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సంజయ్ కుమారుడిపై పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైందని పేర్కొన్నారు. విచారణ పారదర్శకంగా జరగాలంటే సంజయ్ మంత్రి పదవిలో ఉండకూడదన్నారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వతంత్ర విచారణ జరిగేందుకు ప్రధాని చొరవ చూపాలని కోరారు. దేశంలో మైనర్ల రక్షణ కన్నా రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ కాదన్న విషయాన్ని మోదీ గుర్తించాలని సూచించారు.
బాధితురాలికి పూర్తి న్యాయం జరగాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం కలగాలన్నా విచారణలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండొద్దని చెప్పారు. రాజ్యాంగ నిబద్ధత, నైతిక విలువలను కాపాడడం ప్రధాని కర్తవ్యమన్నారు. చట్టపరంగా సంజయ్కుమారుడిపై నేరారోపణలను నిగ్గు తేల్చేది కోర్టులేనని తెలిపారు. అయితే, సంజయ్ పదవిలో ఉండడం వల్ల దర్యాప్తు ప్రక్రియ, సాక్ష్యాల సేకరణ, సాక్షుల రక్షణపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
