రేపటి నుంచే(ఆగస్టు 18) కేబీఆర్‌‌‌‌ చుట్టూ వన్ వే..ప్రజలంతా సహకరించాలి: సీపీ సజ్జనార్

రేపటి నుంచే(ఆగస్టు 18) కేబీఆర్‌‌‌‌ చుట్టూ వన్ వే..ప్రజలంతా సహకరించాలి: సీపీ సజ్జనార్
  •     పరిస్థితులను బట్టి  మార్పులు చేస్తమన్న పోలీస్​బాస్​
  •      పనులు రెండేండ్ల పాటు కొనసాగుతాయని ప్రకటన  
  •     కీలకమైన టాస్క్‌‌కు సిటీ పోలీస్​ రెడీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌ సిటీ పోలీసులు పెద్ద టాస్క్‌‌కు సిద్ధమయ్యారు. హెచ్​సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో కేబీఆర్​చుట్టుపక్కల ఫ్లై ఓవర్లు, అండర్​పాస్‌‌ల నిర్మాణం నేపథ్యంలో మంగళవారం నుంచి ‘వన్​వే’ విధానాన్ని అమలు చేయనున్నారు. సిటీలోని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లడానికి ఈ రూట్​కీలకమైనది. అలాగే, హాస్పిటల్స్​కూడా ఉండడం, వీఐపీ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలగకుండా పక్కా ప్లాన్​ప్రకారం ముందుకు సాగుతున్నారు. 

ఇప్పటికే రెండుసార్లు ట్రయల్​రన్​చేసిన పోలీసులు 18వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో వన్​వే అమలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సిటీ పోలీస్​బాస్​సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. నగరవాసుల ట్రాఫిక్​కష్టాలు తీర్చడం, వేగవంతమైన ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేయబోతుందని, తొలి రోజుల్లో కొంత ఇబ్బంది ఎదురుకావచ్చని, దీనికి అందరూ సహకరించాలన్నారు. తాము ఎన్ని రూల్స్​విధించినా చివరకు ప్రజల నుంచి మద్దతు ఉంటేనే విజయవంతం అవుతుందన్నారు.  

ఎప్పటికప్పుడు మార్పులు చేస్తం  

రూ.1,090 కోట్ల అంచనాతో కేబీఆర్ పార్క్‌‌ చుట్టుపక్కల ఉన్న ఆరు ప్రధాన జంక్షన్లలో ఏడు మల్టీ -లెవెల్ స్టీల్ ఫ్లై ఓవర్లు, ఏడు అండర్‌‌పాస్‌‌ల నిర్మాణం 24 నెలల పాటు కొనసాగనున్నదని సీపీ సజ్జనార్ తెలిపారు. వన్​వే వల్ల ఎక్కడా ‘హెచ్‌‌ సిటీ ’ నిర్మాణ పనులకు ఆటంకం కలగదన్నారు. సమగ్ర అధ్యయనం, రెండు విడతల ట్రయల్ రన్స్ తర్వాతే జీహెచ్ఎంసీ సహకారంతో ఫీల్డ్​లెవెల్లో సమస్యలను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇకపై కూడా ప్రజలకు ఏర్పడే ఇబ్బందులను పరిశీలించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ప్లాన్లలో మార్పులు చేస్తామన్నారు. 

పీక్ టైంలో జూబ్లీహిల్స్​లో 15 వేల కార్లు  

కోర్ సిటీని ఐటీ సాఫ్ట్‌‌వేర్ హబ్‌‌తో అనుసంధానించే కేబీఆర్ పార్క్ కారిడార్ సిటీలోనే అత్యంత రద్దీ గల రూట్​అని సీపీ సజ్జనార్​చెప్పారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ రూట్లో వాహనాల రాకపోకలను సైంటిఫిక్​గా అంచనా వేసేందుకు చేయించిన సర్వేలో ఫలితాలు అక్కడి ట్రాఫిక్​రద్దీకి అద్దం పట్టాయన్నారు. జూబ్లీహిల్స్ చెక్‌‌పోస్ట్ జంక్షన్ వద్ద గంటకు అత్యధికంగా 15,321 కార్లు , కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్​వద్ద 13,516  కార్లు రాకపోకలు సాగిస్తున్నాయని తేలిందన్నారు. ఈ రెండు జంక్షన్లు కిక్కిరిసిపోతూ ట్రాఫిక్‌‌కు ప్రధాన సమస్యగా మారాయన్నారు.  

అలాగే, మహారాజా అగ్రసేన్ జంక్షన్ వద్ద 10,356, రోడ్ నంబర్ 45 జంక్షన్ వద్ద  9,966,  ఫిలింనగర్ జంక్షన్ వద్ద 9,605, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద గంటకు 5,880 కార్లు వచ్చి పోతున్నాయన్నారు. ఇన్ని వేల వాహనాలతో కిక్కిరిసిపోయే ఈ రూట్‌‌లో సిగ్నల్స్ ద్వారా రద్దీని కంట్రోల్​చేయడం సాధ్యం కాని పని అని, అందుకే ఫ్లై ఓవర్లు, అండర్​పాస్‌‌ల అవసరం ఏర్పడిందన్నారు. నిర్మాణాలు పూర్తయితే ట్రాఫిక్​సమస్యకు పరిష్కారం దొరకడమే కాకుండా, కోర్ సిటీ-ఐటీ కారిడార్ మధ్య ప్రయాణ సమయం తగ్గి రూ.కోట్ల రూపాయల ఇంధనం ఆదా అవుతుందన్నారు.