అవి కేసీఆర్ బినామీ కంపెనీలు.. తక్కువ ధరకే భూములు

అవి కేసీఆర్ బినామీ కంపెనీలు.. తక్కువ ధరకే భూములు
  • కేసీఆర్ నిర్వాకం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్ల నష్టం
  • ప్రజల సంక్షేమం కోసం కాదు.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకే భూములు అమ్మారు
  • పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 

హైదరాబాద్: ‘‘కోకాపేట భూములు కేసీఆర్ బినామీలకు అగ్గువకు కట్టబెట్టారు.. కేసీఆర్ నిర్వాకం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్ల నష్టం జరిగింది.. ప్రజల సంక్షేమం కోసం కాదు.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకే భూములు అమ్మారు..’’ అంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోకాపెట్ భూములు కొన్నది సీఎం కేసీఆర్ బినామీలేనని, టీఆర్ఎస్ పార్టీ వారు.. కేసీఆర్ బంధువులే భూముల కోనుగోలులో పాల్గొన్నారని ఆయన విమర్శించారు. 
వేరే కంపెనీలేవీ పాల్గొనలేదు.. మతలబు ఏంటి.. ?
కోకాపేట భూముల అమ్మకం టెంటర్లలో వేరే ఏ కంపెనీలు టెండర్ లు ఎందుకు వేయలేదు? ఇందులో ఉన్న మతలపు ఏంటి ? అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ బినామీ కంపెనీలు కాబట్టే తక్కువ ధరకే భూములు కట్టబెట్టారని.. సిద్దిపేట జిల్లా కలెక్టరే ఏ కంపెనీలు కూడా టెండర్లో పాల్గొనకుండా ఫోన్ చేసి బెదిరించారని ఆయన ఆరోపించారు. ఒక వేళ టెండర్లో పాల్గొంటే మీ కంపెనీలకు ఇన్సెంటివ్ లు కట్ చేస్తామని.. మీరు భూములు ఎలా కొంటారో చూస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బెదిరించినట్టు తనకు కొంత మంది ఫోన్ చేసి గోడు చెప్పుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. భూములు అమ్మకాల్లో కేసీఆర్ కు వాట ఉందని.. చీకటి ఒప్పందం జరిగిందని, ఈ అవినీతిలో కేసీఆర్ కుటుంబానికి వాటా ఉందన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ వెంకట రామిరెడ్డి రాష్ట్రంలో  చేస్తున్న భూ భాగోతాలు అన్నీ త్వరలో బయట పెడతానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.  సిద్దిపేట కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి కేసీఆర్ కాళ్లు మొక్కడం వెనుక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధం ఉందన్నారు. తెలంగాణలో భూములు అమ్మకం పై పార్లమెంటులో లేవనెత్తుతానని.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్నారు. అవసరమైతే హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ల ను కలుస్తానన్నారు. భూముల అమ్మకాలపై సీబీఐ తో విచారణ చేయాలని  ఫిర్యాదు చేస్తానని, బీజేపీ వాళ్లు విచారణ చేస్తారా? లేదా చూస్తానన్నారు. టీఆర్ఎష్- బీజేపి మధ్య ఏమైనా చీకటి ఒప్పందం ఉందా ?  అనే విషయం కూడా తెలుస్తుందన్నారు.