కేసీఆర్ ‘పాలమూరు’ సభలు రద్దు!

కేసీఆర్ ‘పాలమూరు’ సభలు రద్దు!
  • ప్రాజెక్టు ఇష్యూపై ప్రభుత్వానికి సవాల్​ విసిరిన గులాబీ బాస్​
  • అసెంబ్లీ తర్వాత సభలు పెట్టాలని గతంలో నిర్ణయం
  • ఇప్పుడు మున్సిపల్​ ఎన్నికల సాకుతో వెనక్కి

హైదరాబాద్, వెలుగు: ‘ఇగ నేనొస్తున్నా.. మీ తోలుతీస్తం’.. ఇదీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇష్యూపై ఇటీవల కేసీఆర్​ చెప్పిన మాట. ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతున్నదని, ఇక పోరాటమేనని ప్రభుత్వానికి సవాల్​ కూడా విసిరారు. సభలు పెడ్తానన్నారు. కానీ, ఇప్పుడు ఆ సభలను కేసీఆర్​ రద్దు చేసుకున్నట్టు తెలుస్తున్నది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతుల కోసం మంత్రి ఉత్తమ్​ రాసిన లేఖపై.. నిరుడు డిసెంబర్​ 21న తెలంగాణభవన్​లో కేసీఆర్​ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశం సందర్భంగానే ప్రభుత్వం తోలుతీస్తామంటూ వార్నింగ్​ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నల్గొండ, మహబూబ్​నగర్​, రంగారెడ్డి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్​ చేశారు.

 డిసెంబర్​ 29న అసెంబ్లీ సెషన్​ను ప్రభుత్వం నిర్వహించింది. వారం రోజులపాటు సభను నిర్వహించినా బీఆర్​ఎస్​ బాయ్​కాట్​ చేసి ప్రభుత్వానికి సమాధానం చెప్పలేకపోయింది. అసెంబ్లీ సెషన్​ ముగిశాక ‘పాలమూరు’ సభలను నిర్వహించాలని ముందుగా బీఆర్​ఎస్​ పెద్దలు నిర్ణయించారు. అసెంబ్లీ ముగిసి దాదాపు మూడు వారాలవుతున్నా ఆ సభలపై ఉలుకూపలుకూ లేదు. డిసెంబర్​ 21న తెలంగాణభవన్​లో మీటింగ్​ తర్వాత ఫాంహౌస్​కు వెళ్లిపోయిన కేసీఆర్​.. మళ్లీ అసెంబ్లీ సెషన్​ ప్రారంభ రోజున సంతకం పెట్టేందుకు వచ్చారు. ఐదు పది నిమిషాలు సభలో గడిపి ఇంటికెళ్లిపోయారు. అప్పటి నుంచి ‘కేసీఆర్​ పోరాటాలపై’ కనీస చర్చ కూడా జరగలేదు. ఇప్పుడు మున్సిపల్​ ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్​ తన పాలమూరు సభలను రద్దు చేసుకున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది. 

వాళ్ల లోపం బయటపడుతుందనేనా..

మున్సిపల్​ ఎన్నికల పేరు చెబుతున్నా.. అసలు విషయం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో బీఆర్​ఎస్​ చేసిన తప్పులే కనిపిస్తాయన్న ఉద్దేశం కూడా సభల రద్దుకు కారణంగా చెబుతున్నారు. వాస్తవానికి మంత్రి ఉత్తమ్​.. కేవలం 45 టీఎంసీలకే అనుమతి ఇవ్వాలని లేఖలో రాయలేదు. రెండో ఫేజ్​లో కచ్చితంగా మిగతా 45 టీఎంసీలనూ వాడుకుంటామని స్పష్టంగా రాశారు. కానీ, బీఆర్​ఎస్​ మాత్రం తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. కేవలం 45 టీఎంసీలకే ప్రభుత్వం పాలమూరును పరిమితం చేసిందంటూ ఆరోపణలు గుప్పించింది. ఈ క్రమంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు సంబంధించి గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే ఇప్పుడు లేఖలోనూ రాశామని మంత్రి ఉత్తమ్​ కూడా కౌంటర్​ ఇచ్చారు. 

అయితే, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టు మీద సభలు పెట్టి ప్రజలకు ఏమని చెప్పాలని బీఆర్​ఎస్​ పెద్దలు ఆలోచనలో పడినట్లు తెలిసింది. ఎన్నికల టైంలో ఒక్క పంపును ఆన్​ చేసి నీళ్లను ఎత్తిపోశారుగానీ.. కనీసం ఉద్ధండాపూర్​ రిజర్వాయర్​ నిర్వాసితులకు పరిహారం విషయంగానీ.. ఆ ప్రాజెక్టుకు డిస్ట్రిబ్యూటరీలు, కాల్వల తవ్వకంపనులనుగానీ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఈ క్రమంలోనే సభలు పెడితే ప్రజల ముందు దొరికిపోతామన్న యోచనతోనే రద్దు చేసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  మున్సిపల్​ ఎన్నికలయ్యాకైనా పెడతారా పెట్టరా అనే దానిపై బీఆర్​ఎస్​ వర్గాల నుంచి క్లారిటీ లేకపోవడం గమనార్హం.