దక్షిణాది ప్రధాని?..కేసీఆర్ టూర్ ఎజెండా ఇదే

దక్షిణాది ప్రధాని?..కేసీఆర్ టూర్ ఎజెండా ఇదే
  • ఫ్రంట్తో పాటే సౌత్ పీఎం ప్రతిపాదన!
  • విజయన్తో భేటీ, కుమారస్వామితో ఫోన్
  • ఇప్పటి వరకు ఇద్దరే దక్షిణాది పీఎంలు
  • 1991లో పీవీ, 1996లో దేవెగౌడ
  • 20 ఏండ్లకుపైగా సౌత్కు దక్కని చాన్స్
  • ఈసారి దక్షిణాది నుంచేనన్న ప్రకాశ్ అంబేడ్కర్
  • దేవెగౌడ, కేసీఆర్​లో ఒకరు కావొచ్చన్న అభిప్రాయం

లోక్ సభకు ఐదు దశల పోలింగ్ పూర్తి కావడంతో ట్రెండ్ ఎలా ఉందన్న విశ్లేషణలు మొదలయ్యాయి. కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చన్న అంచనాలతో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఉత్తరాదిలో ఇంకా ఎన్నికల హడావుడి నడుస్తుంటే దక్షిణాదిలో చాలావరకు పూర్తైంది. ఈ సందట్లో ఇప్పుడు వినిపిస్తున్న కొత్త ప్రతిపాదన దక్షిణాది నేతను ప్రధానమంత్రిని చేయడం. రెండు దశాబ్దాలకుపైగా దక్షిణాది నుంచి ఒక్కరూ ప్రధాని కాకపోవడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల నేతలతో మంతనాలు సాగిస్తున్న సీఎం కేసీఆర్ ఈ ప్రతిపాదనపైనా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

వారం రోజుల పాటు కేరళ, తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ప్రధానంగా రెండు అంశాలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్ తో సమావేశమైన ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనతో పాటు అవకాశాన్ని బట్టి ఈసారి దక్షిణాది నేతను ప్రధానిని చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా సెక్యులర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును విజయన్ సమర్థించారు. ప్రధాని పదవి విషయంలో మాత్రం మే 23 తర్వాత లెఫ్ట్ పార్టీలన్ని సమావేశమై నిర్ణయం తీసుకుంటాయని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

అప్పుడు ఉత్తరం ఇప్పుడు దక్షిణం

దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల సందర్శనతో పాటు కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోఉత్తరాది, తూర్పు భారతానికి చెందిన పలువురు నేతలతో సమావేశమై ఆయన చర్చలు జరిపారు. ఇప్పుడు ఎన్నికలు దాదాపు పూర్తైన దక్షిణాది రాష్ట్రాల యాత్ర చేపట్టారు. సోమవారం విజయన్ తో భేటీ అయిన కేసీఆర్, కర్నాటక సీఎం కుమారస్వామితోనూ ఫోన్లో మాట్లాడారు. విజయన్ తో మంచి సంబంధాలున్న కేసీఆర్ ఆయన ద్వారా కమ్యూనిస్టులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. విజయన్ తో భేటీలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ట్రెండ్స్ పై తనకున్న సమాచారాన్ని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5 విడతల పోలింగ్ జరగ్గా మరో రెండు విడతలు ఉన్నాయి. ఇందులో 434 స్థానాల్లో పోలింగ్ పూర్తి కాగా ఇంకా 109 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీ గానీ మెజారిటీ సీట్లు సాధించే పరిస్థితిలో లేవని కేసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే ఎన్డీఏ, యూపీఏలు కూడా మెజారిటీకి చాలా దూరంలో ఆగిపోతాయని ఆయన అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయనీ, సెక్యులర్ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సీపీఎం కూడా ముందుకొచ్చేలా పార్టీని ఒప్పించాలని విజయన్ ను కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో మీటింగ్ పై విజయన్ మీడియాతో మాట్లాడారు. ఇద్దరి మధ్య సమావేశానికి చాలా ప్రాధాన్యం ఉందనీ, అయితే ప్రధాని పదవి గురించి మాత్రం తమ మధ్య చర్చ జరగలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కూటముల్లో ఎవరికీ ఈసారి మెజారిటీ రాదని కేసీఆర్ తనతో అన్నట్లు విజయన్ చెప్పారు.

ఇప్పటికే జగన్, అసద్ మద్దతు

లోక్ సభలో 130 సీట్లున్న దక్షిణాది నుంచి ఈసారి ప్రధాని రావాలన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. 1991లో పీవీ నరసింహారావు తొలిసారిగా దక్షినాది నుంచి ప్రధాని పదవి చేపట్టారు. ఆయన తర్వాత వెంటనే 1996లో దేవెగౌడ రెండో దక్షిణాది పీఎం అయ్యారు. ఆయన ఏడాది కంటే ఎక్కువకాలం పదవిలో లేరు. ఆ తర్వాత రెండు దశాబ్దాల కాలంలో మళ్లీ దక్షిణాది నేతకు అవకాశం దక్కలేదు. ఈసారి అవకాశం వస్తే ప్రధానిగా సౌత్ నేతను ప్రతిపాదించాలన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ విషయాన్నే విజయన్ తో కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మద్దతిస్తున్నురు. అటు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ తోనూ కేసీఆర్ స్నేహసంబంధాలు సాగిస్తున్నారు. ఇక సౌత్ టూర్ ద్వారా విజయన్ తో పాటు స్టాలిన్, కుమారస్వామి మద్దతు కూడా సంపాదించి దక్షిణాది పీఎం ప్రతిపాదనను బలంగా వినిపించాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా తెలుస్తోంది. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ ఆలోచనను సినీ నటుడు ప్రకాశ్ రాజ్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అభినందించారు. మహారాష్ట్రలో వంచిత్ బహుజన్ సంఘ్ పార్టీని స్థాపించిన ప్రకాశ్ అంబేద్కర్ ఎంఐఎంతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేశారు. ఈసారి దక్షిణాది నుంచే ప్రధాని అవుతారనీ, అది దేవెగౌడ లేక కేసీఆర్ కావచ్చని ఆయన కామెంట్ చేశారు.

మొదట్లో కేరళ, తమిళనాడు యాత్ర అనుకున్న కేసీఆర్ కర్నాటక కూడా వెళ్లి సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యే అవకాశముంది. సోమవారం కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడిన కుమారస్వామి ఆయన్ను బెంగళూరుకు రావాలని ఆహ్వానించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కు మద్దతు ప్రకటించిన కేసీఆర్ కు దళపతులతో మంచి సంబంధాలున్నాయి. ఈ దోస్తీతోనే మహబూబ్ నగర్ కు మంచినీళ్ల కోసం నారాయణపూర్ రిజర్వాయర్  నుంచి 2.5 టీఎంసీల నీటిని విడుదల చేయించారు. ఇక దక్షిణాది ప్రధాని ఆలోచన జేడీఎస్ ను కూడా ఆకర్షించే అంశమే. 85 ఏళ్ల వయసులోనూ దేవెగౌడ తుమకూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. అన్నీ కలిసొస్తే గతంలో ప్రధానిగా ఉన్న అనుభవంతో తనకు మళ్లీ ఆ అవకాశం వస్తుందని ఆయన భావిస్తున్నారు.

రాహుల్ వైపే స్టాలిన్

తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ కావాలని భావిస్తున్న కేసీఆర్ ప్రతిపాదనకు ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా సమర్థిస్తామని స్టాలిన్‌ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయంలో ఆయనకు  మరో ఆలోచన లేదని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. 13న స్టాలిన్‌ను కలవాలని కేసీఆర్ భావించారు. స్టాలిన్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల కేసీఆర్ తో సమావేశం ఉండకపోవచ్చని డీఎంకే వర్గాల సమాచారం