వెంటిలేటర్పై కేసీఆర్​ ప్రభుత్వం

వెంటిలేటర్పై కేసీఆర్​ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించాలని కేసీఆర్​ కు సవాల్​ విసిరారు. ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వంలోని  మంత్రులు, ఎమ్మెల్యేలు ఎటెటో పోతున్నరట.. రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్​ లో ఉంది. దాన్ని కాపాడుకోవడంపై కేసీఆర్​ దృష్టిపెడితే మంచిది” అని సూచించారు. శనివారం రాత్రి మీడియా సమావేశంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడే ర్యాలీలు చేయని కేసీఆర్​.. రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ర్యాలీలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రపతి ఎన్నికలను అగౌరవపరిచేలా సీఎం కేసీఆర్​ నడుచుకుంటున్నారని బండి సంజయ్​ ధ్వజమెత్తారు.  

రాష్ట్రపతి ఎన్నికలు ఏమైనా.. పబ్లిక్​ ఎన్నికలా..?

ప్రచార ర్యాలీలు నిర్వహించడానికి రాష్ట్రపతి ఎన్నికలు ఏమైనా పబ్లిక్​ ఎన్నికలా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘యశ్వంత్​ సిన్హా గెలిచేది లేదు.. ఏం లేదు.. ర్యాలీలతో ఆర్భాటం చేయడం అవసరమా..? అదేమైనా గ్రామ సర్పంచ్​ ఎన్నిక అనుకున్నవా కేసీఆర్​ ?” అని వ్యాఖ్యానించారు. 370 ఆర్టికల్​ రద్దు, ట్రిపుల్​ తలాక్​, అయోధ్య రామమందిర నిర్మాణం, పేదలకు ఇళ్లు, అన్నయోజన బియ్యం పంపిణీ, స్వచ్ఛ భారత్​, గ్రామీణ సడక్​యోజన వంటి పథకాలన్నీ మోడీ వల్లే జరిగాయని సంజయ్​ గుర్తు చేశారు. పంజాబ్​ కు వెళ్లి  రైతులకు రూ.3 లక్షలు ఇచ్చిన కేసీఆర్​..  తెలంగాణ రైతులకు ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల చేతులకు బేడీలు వేసిన రైతు ద్రోహి కేసీఆర్​ అని కామెంట్​ చేశారు. ఆదివారం సాయంత్రం 4గంటలకు సికింద్రాబాద్​ లోని పరేడ్​ గ్రౌండ్​ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సంజయ్​ పిలుపునిచ్చారు.