రూ.కోటితో ప్రభుత్వ పాఠశాల బాగుచేయించిన హిమాన్షు.. సీఎం మనవడు.. మంత్రి కొడుకు

రూ.కోటితో ప్రభుత్వ పాఠశాల బాగుచేయించిన హిమాన్షు.. సీఎం మనవడు.. మంత్రి కొడుకు

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు పెద్ద మనసును చాటుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని.. దాన్ని కార్పొరేట్‌ స్కూల్‌కు ధీటుగా తీర్చిదిద్దారు. 

తాను సీఏఎస్ అధ్యక్షుడిగా తన పాఠశాలలో సేకరించిన నిధులతో అంటే దాదాపు రూ.కోటి రూపాయలతో పాఠశాలను కార్పొరేట్ స్కూల్ మాదిరిగా తీర్చిదిద్దారు. జులై 12న  హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు.

హిమాన్షు ఖాజాగూడలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో చదువుతున్న సమయంలోనే.. అదే ఏరియాలోని కేశవనగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శిస్తూ.. అక్కడి విద్యార్థులతో మాట్లాడుతుండే వారు. అక్కడి పాఠశాలలో ఎదురవుతున్న ఇబ్బందులను విద్యార్థుల ద్వారా తెలుసుకొని చలించిపోయిన హిమాన్షు.. పాఠశాలను తీర్చిదిద్దాలని సంకల్పించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకున్నారు. ఇందుకోసం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులు సేకరించారు. ఇందు కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

వచ్చిన డబ్బులతో స్కూల్‌ను అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాల అభివృద్ధి కోసం సుమారు రూ.కోటి వరకు ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్‌ పేర్కొన్నారు. హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ గది, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సర్కారు పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన హిమాన్షును పలువురు అభినందిస్తున్నారు. చిన్న వయస్సులో పెద్ద మనస్సు చాటుకున్నారని ప్రశంసిస్తున్నారు.