రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం

రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం

ప్రగతి పథంలో రాష్ట్రం

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్​ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశచరిత్రలోనే అపూర్వ మహోద్యమాన్ని సాగించి, సాధించుకున్న రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు పెడుతోందని, అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి ఐదేళ్ల కాలంలో బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన, సరైన అడుగులు పడ్డాయని ఆయన పేర్కొన్నారు.

పబ్లిక్‌‌ గార్డెన్స్‌‌లో నేడు ఆవిర్భావ సంబురం

రాష్ట్ర ఆరో ఆవిర్భావ సంబురాలకు పబ్లిక్‌‌ గార్డెన్స్‌‌ ముస్తాబైంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఈ యేడు సాదాసీదాగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో సికింద్రాబాద్‌‌ పోలీస్‌‌ పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో ఆవిర్భావ వేడుకలు నిర్వహించగా, ఇప్పడు పబ్లిక్‌‌ గార్డెన్స్‌‌కు మార్చారు. ఆదివారం ఉదయం 9 గంటలకు గన్‌‌పార్క్‌‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్‌‌ నివాళులర్పిస్తారు. 9.05 గంటలకు పబ్లిక్‌‌ గార్డెన్స్‌‌ సెంట్రల్‌‌ లాన్స్‌‌కు చేరుకుని జాతీయ జెండా ఎగురవేస్తారు. తర్వాత రాష్ట్ర ప్రగతి నివేదికను ప్రజలకు వివరిస్తారు. 10.30 గంటలకు సీఎస్‌‌ ఎస్‌‌కే జోషి ఆధ్వర్యంలో అతిథులకు ఎట్‌‌ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 11 గంటలకు జూబ్లీ హాల్‌‌లో కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు.

రవీంద్రభారతిలో మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు భాషా సాంస్కృతిక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు సాయంత్రం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులకు అవార్డులను ప్రదానం చేస్తారు. మూడు, నాలుగు తేదీల్లో రవీంద్రభారతిలో 48 గంటల ఫిల్మ్‌‌ మేకింగ్‌‌ చాలెంజ్‌‌ నిర్వహిస్తున్నారు. సెక్రటేరియట్‌‌, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, నెక్లెస్‌‌ రోడ్డు, ట్యాంక్‌‌బండ్‌‌ తదితర ప్రాంతాల్లో రంగురంగుల లైట్లను ఏర్పాటు చేశారు.