ఫామ్ హౌస్ లో కేసీఆర్.. ప్రగతి భవన్ లో మంత్రులతో కేటీఆర్ మీటింగ్

ఫామ్ హౌస్ లో కేసీఆర్..  ప్రగతి భవన్ లో మంత్రులతో కేటీఆర్ మీటింగ్

కేటీఆర్ కేబినెట్….!

8 గంటలపాటు సుదీర్ఘ భేటీ

అందరు మంత్రులు, అన్ని శాఖల సీనియర్ ఆఫీసర్లు హాజరు

ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై చర్చ

పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్

రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో కొత్త ట్రెండ్ కు తెరలేచింది. తొలిసారి సీఎం కేసీఆర్ లేకుండానే.. మంత్రి కేటీఆర్ సారథ్యంలో రాష్ట్ర మంత్రులంతా సమావేశమయ్యారుఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో మంత్రులందరూ బుధవారం మీటింగ్ కు హాజరయ్యారు. రెగ్యులర్ గా సీఎం కేసీఆర్ నిర్వహించే కేబినెట్ మీటింగ్ తరహాలోనే ప్రగతిభవన్ లో సమావేశం జరిగింది. కేబినెట్ మంత్రుల్లో ఒకరైన కేటీఆర్ సారథిగా సమావేశం జరగడం.. దీనికి అందరు మంత్రులు, రాష్ట్రంలోని అన్ని శాఖల సీనియర్ ఆఫీసర్లు హాజరవటం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉండటం.. సీఎం  ఆదేశాలతోనే మీటింగ్ నిర్వహించినట్లు కేటీఆర్ ట్వీట్ చేయటం కొసమెరుపు.

హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్​ ఆధ్వర్యంలో ఫస్ట్​ టైమ్ బుధవారం ‘కౌన్సిల్​ ఆఫ్ మినిస్టర్స్ ’ మీటింగ్ జరిగింది. సీఎస్ తోపాటు అన్ని శాఖల ప్రిన్సిపల్​ సెక్రెటరీలు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, చీఫ్ అడ్వయిజర్ రాజీవ్ శర్మ కూడా ఈ సమావేశంలో పాల్గొ న్నారు. సుదీర్ఘంగా 8 గంటల పాటు జరిగిన ఈ మీటింగ్ లో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై కేటీఆర్​ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలసీలపై మంత్రులకు వివరించారు. ఆ తర్వాత మంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సీఎం కాకుండా మంత్రి ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్​ మీటింగ్ నిర్వహిస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు నాటి హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్ సెక్రటేరియట్ లో మంత్రులతో మీటింగ్ నిర్వహించారు. వైఎస్సార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించడం లేదని వార్త తెలిసినప్పుడు నాటి ఫైనాన్స్ మినిస్టర్ రోశయ్య క్యాంపు ఆఫీసులో మంత్రులతో మీటింగ్ పెట్టారు. తొలి ప్రభుత్వంలో కేసీఆర్ చైనా, సింగపూర్, మలేషియా టూర్ వెళ్లినప్పుడు ఆయన వద్ద ఉన్న శాఖలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి అప్పగించారు. కానీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇలా ఒక మంత్రి ఆధ్వర్యంలో మంత్రులంతా సమావేశమైన సందర్భాలు లేవు. సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండగా.. కేటీఆర్ కేబినెట్ మంత్రులందరినీ సమావేశపరిచిన తీరు.. అన్ని రాజకీయ పక్షాలను, రాజ్యాంగ నిపుణులను విస్మయానికి గురిచేసింది.

మీటింగ్ పై కేటీఆర్ ట్వీట్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలకు సంబంధించిన డ్రాప్ట్ కాపీనికేబినెట్ సహచరులకు అందించినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 8 గంటల పాటు జరిగిన సమావేశంలో మంత్రులు ఇచ్చిన విలువైన సలహాలను త్వరలో కేబినెట్ లో ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నా రు.

ఇదీ మీటింగ్ షెడ్యూల్

ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ సమన్వయంతో ‘కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్’ మీటింగ్ ఉందని కేటీఆర్ ఆఫీసు బుధవారం ఉదయం మీటింగ్ షెడ్యూల్ ను మీడియాకు రిలీజ్ చేసింది. అంతకు ముందే మంత్రులకు సమాచారం అందించింది. అందులో ఉదయం 10 గంటల నుం చి సాయంత్రం 4 గంటలకు వరకు మీటింగ్ లో ఎవరెవరూ మాట్లాడుతరనే వివరాలు ఉన్నాయి. వెల్ కమ్ రిమార్క్స్ ఇండస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓపెనిం గ్ రిమార్క్స్ సీఎస్, చీఫ్ అడ్వయిజర్ చేస్తారని ఉంది. ఫుడ్ ప్రాసెసిం గ్ పాలసీని ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ సమర్పిస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత వరుసగా అగ్రికల్చర్, ఎనిమల్ హజ్బండరీ, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్, ఎస్సీ డెవలప్ మెంట్, ఉమెన్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల ప్రజెంటేషన్ ఉంటుందని షెడ్యూల్లో ఉంది. పాలసీపై ‘కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ’ చర్చించిన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటందని పేర్కొన్నారు. మీటింగ్ తిరిగి మొదలైన వెంటనే కేటీఆర్ లాజిస్టిక్ పాలసీపై మాట్లాడుతారని, ఆతర్వాత మంత్రుల చర్చ, చివరకి ఇండస్ట్రీ సెక్రటరీ రిమార్క్ తో మీటింగ్ ముగుస్తుందని షెడ్యూల్ లో ఉంది.

రాజకీయ వర్గా ల్లో చర్చ!

ఇప్పటివరకు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ మాత్రమే మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రం వచ్చిన మొదట్లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే నుంచి ఈ మధ్య అమల్లోకి వచ్చిన షరతుల సాగు విధానం వరకు ఆయనే మంత్రులతో మీటింగ్ పెట్టి ని ర్ణయాలు తీసుకున్నారు. కానీ మొదటిసారి కేటీఆర్ ప్రగతిభవన్ లో.. అది కూడా కీలక పాలసీలపై మంత్రులందరితో మీటింగ్ నిర్వహించడం  ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ.. అటు రాజకీయ వర్గా ల్లోనూ చర్చకు దారితీసింది. ఈ పాలసీలపై ఇండస్ట్రీ మంత్రిగా కేటీఆర్ ఆధ్వర్యంలో ఒకరిద్దరు మంత్రులు మెంబర్లుగా సబ్ కమిటీ ఏర్పాటు చేసే చాన్స్ ఉన్నా, అలా చేయకుండా అందరు మంత్రులతో మీటింగ్ నిర్వహించడం చర్చనీయాంశమైంది.

ఇది రిహార్సల్స్ మాత్రమేనట!

కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులంతా సమావేశమవడంపై కొందరు టీఆర్ఎస్ లీడర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇది రిహార్సల్ మాత్రమేనని, త్వరలో సీఎం హోదాలో కేటీఆర్ రివ్యూలు చేసే రోజు వస్తుందని బుధవారం ప్రగతిభవన్ కు వెళ్లిన కొందరు ఎమ్మెల్యే లు అభిప్రాయ పడ్డారు. ‘‘రామన్న త్వరలో సీఎం అవుతారు. అందుకే ఈ రిహార్సల్స్. ఆయన మాట్లాడుతున్న టైంలో సీనియర్ మంత్రులు కూడా చాలా శ్రద్ధగా విన్నారు’’ అని కేటీఆర్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్న ఓ మంత్రి చెప్పారు. కొందరు లీడర్లు లోకల్ లీడర్లకు ఫోన్ చేసి .. మీటింగ్ పై ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు తెలిసింది. కరోనా రావడంతో మంత్రి మల్లారెడ్డి ఈ మీటింగ్ కు హాజరు కాలేదు.