చట్టాల రద్దు మీవల్లే అయితే.. వరి ఎందుకు కొనిపించరు

చట్టాల రద్దు మీవల్లే అయితే.. వరి ఎందుకు కొనిపించరు
  • చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్ వద్ద కేసీఆర్ దీక్ష చేపట్టాలి
  • పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్
  • చనిపోయిన రైతులకు నివాళులర్పిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కేసీఆర్ వల్లే  రద్దయింది నిజమే అయితే.. తెలంగాణ రాష్ట్రంలో వరి పంటను ఎందుకు కొనపించడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద రైతులకు మద్దతుగా ఆమరణ దీక్ష చేపడితేనే తెలంగాణ సమాజం నమ్ముతుందని ఆయన పేర్కొన్నారు. శనివారం సాయంత్రం వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చనిపోయిన రైతులకు నివాళులర్పిస్తూ పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ నుంచి ఇందిరమ్మ విగ్రహం వరకు క్యాండిల్ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రులు గీతారెడ్డి, చిన్నారెడ్డి, అనిల్ యాదవ్, సునీతా రావ్, బలమూరి వెంకట్, నూతి శ్రీకాంత్ తదితర ముఖ్య నాయకులు పాల్గొనారు. క్యాండిల్ పట్టుకొని రైతు అమర వీరులకు నివాళులు అర్పిస్తూ ప్రదర్శన నిర్వహించారు.జై జవాన్ జైకిసాన్  అంటూ నినాదాలు చేశారు. మోడీ, కేసీఆర్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కల్లాల్లో వర్షానికి వరి తడుస్త్తుంటే కనిపించడం లేదా?
వర్షాలకు కల్లాల్లో, గోడౌన్లు లేక నిల్వ చేసుకున్న వరి ధాన్యం మొత్తం తడిసి మొలకలెత్తుతున్న పరిస్థితితో రైతులు అల్లాడుతుంటే కేసీఆర్ కు కనిపించడం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉత్తరాది ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటిస్తే.. కేసీఆర్ తన పోరాటం వల్లే నని క్రెడిట్ తీసుకోవడానికి తాపత్రయ పడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఎండనక.. వాననక ప్రాణాలు పణంగా పెట్టి వేలాది మంది రైతులు పోరాటం చేస్తుంటే కేసీఆర్ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లినా ఏ ఒక్కరోజైనా రైతుల వద్దకు వెళ్లి సంఘీ భావం తెలిపాడా..? అని ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బయటకు తోసేశారని ఆరోపించారు. రైతులంతా దీక్ష చేస్తుంటే.. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ మోడీ ముందు మోకరిల్లాడే తప్ప రైతులను పలుకరించిన పాపాన పోలేదన్నారు. 14 నెలలుగా 700మంది పై చిలుకు రైతులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడితే..దక్కిన విజయాన్ని కేసీఆర్ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 
కేసీఆర్ కు మోడీ భయపడి వణికిపోయి చట్టాలు వెనక్కి తీసుకున్నాడన్నది నిజమైతే.. మరి వరి పంటను ఎందుకు కొనిపిస్తలేవన్నారు. కల్లాల వద్ద  రైతులు చస్తుంటే కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. రైతులు ఆలోచన చేయండి.. దేశానికి, రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ మోడీలేనన్నారు. మోడీ కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని, కేసీఆర్ ఎప్పుడూ మోడీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. ఏడేళ్లుగా దేశాన్ని దోచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయాల్లో. నోట్ల రద్దు.. త్రిబుల్ తలాక్, 374 ఆర్డికల్ రద్దు.. రైతు చట్టాలు తెచ్చిన సమయంలో కూడా మోడీకి అండగా నిలిచారని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ రైతులను ఆదుకోవాలంటే ఇక్కడ ధర్నా చౌక్ లో ధర్నా చేయడం.. దందాలు కాదు.. ఢిల్లీ జంతర్ మంతర్ లో ఆమరణ దీక్ష చేపడితేనే తెలంగాణ సమాజం నమ్ముతుందన్నారు. చట్టాన్ని పార్లమెంటులో రద్దు చేసే వరకు రైతులు వెనక్కి పోవద్దని, రైతుల పక్షాన కాంగ్రెస్ అండగా నిలబడుతుందన్నారు. 
చనిపోయిన ప్రతి రైతుకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి
చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ  చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు పార్లమెంటులో బిల్లు పెట్టి ప్రకటించాలని.. ఇదే సందర్భంగా ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి... కనీస మద్దతు ధర ప్రకటించేలా కేంద్రం ప్రకటన చేసేలా పోరాటం చేయాలని.. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే యాసంగిలోనే కాదు.. ప్రతి ఖరీఫ్ చివరి గింజ వరకు వరి కొనకపోతే.. కేసీఆర్ ను నడిబజారులో ఉరి తీసే విధంగా కార్యాచరణ రూపొందించి పోరాటం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.