హైదరాబాద్, వెలుగు: దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది కేసీఆర్సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశంలో జరిగే ఎన్నికలకు మొత్తం ఫండింగ్ తనే చేస్తాననే స్థాయికి కేసీఆర్ ఎదిగాడంటే ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కిషన్ రెడ్డి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కమీషన్లు తీసుకుంటే.. ఇప్పుడున్న బీఆర్ఎస్ సర్కార్ ప్రతి వ్యాపారంలో వాటాలు తీసుకుంటున్నదని ధ్వజమెత్తారు.
ప్రధాని మోడీ ఈ దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం తెలంగాణ సంపదను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కల్వకుంట్ల కుటుంబం డైనింగ్ టేబుల్ పై నిర్ణయించే స్థాయిలో ఉండడం సిగ్గుచేటని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కుతుందని విమర్శించారు. మరోసారి బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవడం ఖాయమని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీని, అమరుల ఆశయాలను నెరవేర్చే పార్టీని గెలిపించాలని కోరారు.
ఈ తొమ్మిదేండ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదన్నారు. కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే బీజేపీతో ప్రజలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన ఉప్పల్ కు చెందిన రాపోలు వీరరాజారెడ్డికి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. ఆయన తల్లిదండ్రులు కొండారెడ్డి, పుష్పలతను సన్మానించారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణను విమోచనం చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ కృషిని గుర్తించి ఆయన చరిత్రను తెలంగాణలో పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. ప్రధాని మోడీ వివిధ దేశాల్లో పర్యటిస్తుంటే ఆయనకు లభిస్తున్న గౌరవం చూసి భారత పౌరులుగా మనం గర్వపడాలన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పార్టీ నేతలు ఇంద్రసేనా రెడ్డి, చింతల రాంచంద్రా రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
తిరంగా ర్యాలీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి బుల్లెట్ బండి నడపగా దానిపై కిషన్‌రెడ్డి జెండా పట్టుకొని కూర్చున్నారు. బోరబండ రహమత్ నగర్ నుంచి ప్రారంభమైన బీజేపీ బైక్ ర్యాలీ.. ఎస్పీఆర్ హిల్స్ మీదుగా బోరబండ శ్రీరామ్ నగర్ నుంచి రహమత్ నగర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.