కేసీఆర్​కు యువతే బుద్ధి చెప్తరు : వక్తలు

కేసీఆర్​కు యువతే బుద్ధి చెప్తరు : వక్తలు
  • రాష్ట్ర వ్యాప్తంగా 35లక్షల మంది నిరుద్యోగులున్నరు
  • జాగో తెలంగాణ బస్సు యాత్ర ముగింపులో వక్తలు

ఖైరతాబాద్, వెలుగు :  కేసీఆర్ ఫ్యామిలీ చేసిన అవి నీతి, భూ కబ్జాలు, వేల కోట్ల దోపిడీ అంతా ప్రజల్లోకి వెళ్లిందని, ఇక ఎన్నికల్లో ఓటర్లే తగిన బుద్ధి చెప్తారని వక్తలు అన్నారు. యువత కూడా బీఆర్ఎస్​కు వ్యతిరేకంగానే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో 35లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు. డిసెంబర్ 3 తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చిక్కడపల్లిలో కేటీఆర్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్న తొమ్మిదేండ్లు ఏం చేశారని వక్తలు ప్రశ్నించారు. ఓటర్లను చైతన్యపర్చడంలో భాగంగా చేపట్టిన జాగో తెలంగాణ బస్సు యాత్ర మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ‘తెలంగాణలో అవినీతి, ఆర్థిక దోపిడీ రాజకీయాలను ఓడిద్దాం’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాగో తెలంగాణ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. లిక్కర్ స్కామ్​లో దొరికిన కవితను వదిలేశారని విమర్శించారు. మాజీ ఎంపీ వివేక్ బీజేపీ నుంచి బయటికొచ్చినందుకే ఈడీతో దాడులు చేయించారని మండిపడ్డారు.

29 జిల్లాలు.. 64 సెగ్మెంట్లు.. 198 సభలు

అక్టోబర్ 27న ప్రారంభమైన బస్సు యాత్ర మంగళవారంతో ముగిసిందని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. గజ్వేల్, ములుగు మీదుగా మొత్తం 29 జిల్లాలు.. 64 నియోజకవర్గాల్లో పర్యటించామన్నారు. మొత్తం 198 సభలు నిర్వహించినట్లు తెలిపారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ లీడర్లు బస్సు యాత్రను ఆపేందుకు ప్రయత్నిస్తే.. ప్రజలే వాళ్లను అడ్డుకున్నారని వివరించారు. అన్ని గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నదని ప్రొఫెసర్ పద్మజషా మండిపడ్డారు. ప్రజలకు కేసీఆర్ మీద నమ్మకం లేదని ప్రొఫెసర్ వినాయక రెడ్డి అన్నారు. ఈసారి ఎన్ని డబ్బులిచ్చినా బీఆర్ఎస్​ను ఓడిస్తారని తెలిపారు. గతంలో చేసిన తప్పు ఈ ఎన్నికలు చేసేది లేదని చెప్తున్నట్లు వివరించారు. ఎక్సైజ్ ఆదాయంపై ఆధారపడి నడుస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందా అంటే.. అది తెలంగాణ సర్కారే అని మండిపడ్డారు. సమావేశంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రజాస్వామ్య వేదిక ప్రతినిధి కృష్ణమూర్తి, నైనాల గోవర్ధన్, సొగరా బేగం తదితరులు పాల్గొన్నారు.