V6 News

బేగంపేట క్యాంప్ ఆఫీస్ లో KCR, జగన్ భేటీ

బేగంపేట క్యాంప్ ఆఫీస్ లో KCR, జగన్ భేటీ

బేగంపేట క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగం, గోదావరిని కృష్ణా బేసిన్ కు తరలింపు అంశాలపై చర్చించనున్నారు. ఏటా బంగాళాఖాతంలో కలుస్తున్న… గోదావరి, కృష్ణా నీటిని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకునే వ్యూహంపై మాట్లాడనున్నారు. సీఎంల భేటీకి ఏపీ ఇరిగేషన్ స్పెషల్ CS ఆదిత్యనాథ్ దాస్, ఇతర అధికారులతో సహా.. నీటిపారుదల అధికారుల బృందం హాజరవుకానుంది. ఉమ్మడి ఏపీలో 14 వందల 80 టీఎంసీల గోదావరి నీటిని, 811 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునేలా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులున్నాయి. ప్రస్తుతం రెండు నదుల నుంచి వచ్చే 2 వేల 3 వందల టీఎంసీలను పూర్తిస్థాయిలో వాడుకోవాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయించాయి. వీటితో పాటు CWC 50 ఏళ్ల రికార్డుల ప్రకారం…ఏటా యావరేజ్ గా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. వీటిని కూడా వినియోగించుకునేలా ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు.

నదీ జలాలను పంచుకునే విషయంలో.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని… రాష్ట్రాల మధ్య వివాదాల్లో కోర్టుల జోక్యం అవసరం లేదని అభిప్రాయపడుతోంది. సమావేశంలో కీలక విషయాలపై చర్చించి…. అంతే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ముఖ్యంగా గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్ట్ కు తరలించటంపై చర్చ జరుగుతుందని తెలిసింది. సమావేశం తర్వాత రెండు రోజుల్లో రాష్ట్ర అధికారులు.. అమరావతి వెళ్లే చాన్సుంది. ఇద్దరు సీఎంలు తీసుకున్న నిర్ణయాలపై.. ఏపీ, తెలంగాణ అధికారులు చర్చలు జరపనున్నారు.

ఇద్దరు సీఎంలు ఏ, ఏ అంశాలపై చర్చించాలనే విషయంపై.. సీఎస్ SK.జోషి, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులు గత రెండు రోజులుగా సెక్రటేరియట్ లో చర్చలు జరిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీటి పంపకాలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలు, ట్రిబ్యునల్ తీర్పులపై స్టడీచేసి.. ఓ రిపోర్ట్ సిద్దం చేశారు. నిన్న ఏపీ ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ ఆతిథ్యనాధ్ దాస్.. సెక్రటేరియట్ లో సీఎస్ SK. జోషితో భేటీ అయ్యారు.

నది జలాలతో పాటు.. విభజన సమస్యలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రానికి చెందిన 8 వందల మంది నాలుగో తరగతి ఉద్యోగులు.. విభజనలో భాగంగా అమరావతికి అలాట్ అయ్యారు. వీరిని తిరిగి రప్పించే విషయంపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు విద్యుత్ ఉద్యోగుల విభజన.. 9, 10 షెడ్యూల్ లోని అంశాలు, ఢిల్లీలోని ఏపీ భవన్ విజభన అంశాలపై చర్చి జరుగనుది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంపై ఇద్దరు సీఎంలు నెల రోజుల టైమ్ లోనే నాలుగు సార్లు భేటీ అయ్యారు. ఇవాళ్టి సమావేశంలో ఈ సంఖ్య ఐదుకు చేరింది.