రాష్ట్ర ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ పైనే ఉన్నయ్: కేసీఆర్

రాష్ట్ర ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ పైనే ఉన్నయ్: కేసీఆర్

త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్ లో ఇవాళ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.  ఈ సందర్బంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు  కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన కేసీఆర్.. రాష్ట్ర ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ పైనే ఉన్నాయని ఎంపీలకు  చెప్పారు. బీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో  బలంగా ఉందని.. పార్లమెంటులో పార్టీ గళం బలంగా వినిపించాలని సూచించారు. రాష్ట్ర హక్కులు, విభజన చట్టం ప్రకారం  రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించాలని చెప్పారు.  కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే  తెలంగాణకు నష్టమన్నారు.  అధికారం ఉన్నా లేకపోయినా.. రాష్ట్రం కోసం పోరాడేది బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు.

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఫిబ్రవరి రెండో వారంలో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని తెలుస్తోంది. కేసీఆర్ తన కాలికి ఆపరేషన్ అయినప్పటి నుంచి హైదరాబాద్ లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ కు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ ఎక్కడా ప్రజల్లోకి రాలేదు. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా  ఇంత వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు.