ఉద్యమ ద్రోహులతో కేసీఆర్​ మిలాఖత్

ఉద్యమ ద్రోహులతో కేసీఆర్​ మిలాఖత్

హైదరాబాద్, వెలుగు: సీఏం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ విలువలు, ఆకాంక్షలను మరిచి, ఉద్యమ ద్రోహులతో, ఆంధ్రా కాంట్రాక్టర్లతో ములాఖత్ అయి పరిపాలన కొనసాగిస్తున్నారని టీజేఏస్ చీఫ్ కోదండరాం అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను టీజేఏస్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

తర్వాత గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ విలువలను, ఆకాంక్షలను మరిచిపోయిందని, ఉద్యమ ద్రోహులతో, ఆంధ్రా కాంట్రాక్టర్లతో ములాఖాత్ అయి అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని ఫైర్ అయ్యారు.

సీఏం కేసీఆర్ తమ కుటుంబ ప్రయోజనాలకే అధికారాన్ని వాడుకుంటూ, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని,  ప్రభుత్వం రైతుబంధు, పింఛన్లు ఇచ్చినం, దీన్ని దేశమంతా మెచ్చుకుంటుందని గొప్పలు చెపుతున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఫలితాలు ఉద్యమ ద్రోహులు, ఆంధ్రా కాంట్రాక్టర్లకు లభించినంతగా తెలంగాణ ప్రజలకు దక్కలేదని, ఉద్యోగ, ఉపాధి రంగాలు మెరుగుపడలేదన్నారు. గత ఉద్యమాన్ని గుర్తుకు చేసుకొని, ఆ స్ఫూర్తితో ఉద్యమ ఆకాంక్షల సాధనకు పోరాడుదామని, కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా మారుద్దామని కోదండరాం పిలుపునిచ్చారు.