2026లో భారతీయ పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గోల్డ్ ETFల జనవరి నెలలో రికార్డు స్థాయిలో పెట్టుబడులను చూసాయి. డిసెంబర్ 2025లో రూ.11వేల 646.74 కోట్లుగా ఉన్న ఇన్ ఫ్లోస్.. జనవరి 2026 నాటికి ఏకంగా 106 శాతం పెరిగి రూ.24వేల 039.96 కోట్లకు చేరుకున్నాయి. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ ట్రెండ్.. ప్రస్తుత అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో బంగారంపై పెరుగుతున్న నమ్మకాన్ని రుజువు చేస్తోంది. ఆశ్చర్యకరంగా ఈ నెలలో ఈక్విటీ ఫండ్లలోకి వచ్చిన రూ.24వేల 029 కోట్ల పెట్టుబడులతో గోల్డ్ ఈటీఎఫ్స్ సమానంగా నిలవడం గమనార్హం.
కొత్త ఏడాది ప్రారంభంలో పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను రీబ్యాలెన్స్ చేయడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు. ఫిజికల్ గోల్డ్ కంటే గోల్డ్ ఈటీఎఫ్‌లు అత్యంత క్రమబద్ధీకరించబడినవి.. సులభంగా నగదుగా మార్చుకోగలిగినవి, తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావడం వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు, కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు వంటి అంశాలు గోల్డ్ ఈటీఎఫ్‌లను ఒక రక్షిత కవచంలా మార్చాయి.
►ALSO READ | రూటు మార్చేసిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్.. ఇప్పుడు అందరి చూపు అటువైపే
గత ఏడాది అక్టోబర్‌లో రూ.7వేల 700 కోట్ల పెట్టుబడులు రాగా.. నవంబర్‌లో కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే డిసెంబర్ నుంచి మళ్లీ పుంజుకున్నప్పటికీ.. జనవరిలో పతాక స్థాయికి చేరింది. కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి ఈటీఎఫ్‌లలో కూడా భారీగానే వృద్ధి కనిపించింది. జనవరిలో సిల్వర్ ఈటీఎఫ్‌లు రూ.9వేల 463.4 కోట్ల పెట్టుబడులను సాధించడంతో, వీటి మొత్తం ఆస్తుల విలువ రూ.లక్షా 16వేల కోట్లకు చేరింది. ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడులు కేవలం రూ. 23 కోట్లకు పరిమితమవ్వడం పెట్టుబడిదారుల్లో మారుతున్న వ్యూహాత్మక ప్లానింగ్ గురించి స్పష్టం చేస్తోంది.
అయితే ప్రస్తుత ధరల వద్ద బంగారంపై పెట్టుబడులు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాలిక సంపద సృష్టికి ఈక్విటీలే సరైన మార్గమని కొందరు నిపుణులు అంటుంటే.. భారీగా పెరిగిన ధరల వద్ద గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో నష్టదాయకం కావచ్చని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా.. భారతీయ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో బంగారం ఒక నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తోందని, మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఇది ఒక 'స్టెబిలైజర్'గా పనిచేస్తోందని స్పష్టమవుతోంది.
