
హైదరాబాద్, వెలుగు: రాజకీయాల్లో అహంకారం పనిచేయదని, అందుకే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నుంచి అంత మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లోకి ఫిరాయించినా.. ఎంపీ ఎలక్షన్లలో దాని ప్రభావం ఏమాత్రం కనిపించలేదన్నారు. కాంగ్రెస్ ను ఎవరు వీడినా పార్టీకి ఏమాత్రం నష్టం జరగదని ఫిరాయింపుదారులకు మరోసారి స్పష్టమైందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేశారని, అన్ని పార్టీల కంటే క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నది కాంగ్రెసేనని పేర్కొన్నారు. ఉత్తమ్ శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఆరు ఎంపీ సీట్లను గెలుచుకుంటామని భావించామని, కానీ మూడు సీట్లు వచ్చాయని తెలిపారు. గెలిచిన ముగ్గురం కూడా డైనమిక్ లీడర్లమేనన్నారు.
ప్రత్యామ్నాయం మేమే
రాష్ట్రంలో ఎప్పటికైనా టీఆర్ఎస్ ను గద్దె దించేది తామేనని ఉత్తమ్ చెప్పారు. బీజేపీకి ఆ స్థాయి లేదని, అదృష్టం కొద్ది ఆ పార్టీ గెలిచిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు100 సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ కు అసలైన ప్రత్యామ్నాయం తామేనన్నారు. త్వరలో జరిగే నల్గొండ లోకల్ బాడీస్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దేనని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో జడ్పీ చైర్పర్సన్కూడా తమవేనన్నారు. టీఆర్ ఎస్ పరిస్థితి ఒకప్పటిలా లేదని స్పష్టం చేశారు. పీసీసీ మార్పుపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని, తనకు ఏ బాధ్యత అప్పగించినా చేసేందుకు సిద్ధమని చెప్పారు.
గాంధీ భవన్‌లో పీసీసీ భేటీ
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, రాబోయే జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించేందుకు శనివారం గాంధీ భవన్ పీసీసీ ముఖ్యనేతల భేటీ జరుగనుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి పీసీసీ కార్యవర్గ సభ్యులు, ఏఐసీసీ కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీ అభ్యర్థులు హాజరుకావాలని పీసీసీ ఆదేశించింది.