కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
సమావేశం సందర్భంగా నదుల్లో నీటి లభ్యతపై ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు గోదావరి, కృష్ణా వాటి ఉపనదులపై లెక్కలేనన్ని బ్యారేజిలు నిర్మించడం వల్ల కిందికి నీటి రాని పరిస్థితిని వివరించారు. సి.డబ్ల్యు.సి. లెక్కల ప్రకారం ఏ పాయింట్ వద్ద ఎంత నీటి లభ్యత ఉందో వివరించారు. గూగుల్ మ్యాపుల సహకారంతో గోదావరి, కృష్ణా నదుల నీళ్లను సమర్థవంతంగా వినియోగించుకోవడానికున్న మార్గాలను ప్రతిపాదించారు.
సముద్రంలో కలిసే నీళ్లను ఒడిసిపడదాం : కేసీఆర్
‘‘గోదావరి, కృష్ణా నదుల్లో కలిపి 4వేల టిఎంసిల నీటి లభ్యత ఉంది. ఈ నీళ్లను ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలను సుభిక్షం చేయవచ్చు. కావాల్సినంత నీళ్లున్నాయి. ఆ నీళ్లను ఉపయోగించుకోవడానికి విజ్ఞత కావాలి. ఎన్ని నీళ్లను ఉపయోగించుకుంటామన్నది మన సమర్థత మీద ఆధారపడి ఉంది. ప్రతీ ఏటా దాదాపు 3వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. నీళ్లకోసం ట్రిబ్యునళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ,మరొకరి చుట్టూ తిరగడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుని, కలిసి నడిస్తే చాలు. రెండు నదుల్లో ఉన్న నీటిని రెండు రాష్ట్రాల ప్రజలకు వినియోగించే విషయంలో ఏకాభిప్రాయం ఉంటే చాలు.
కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం అనే ప్రతిపాదన తెస్తున్నది. మన నదుల నీళ్లు మన అవసరాలు తీర్చాక కేంద్రం చెప్పే ప్రతిపాదన విషయంలో మనం నిర్ణయం తీసుకోవచ్చు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువ ఉన్నందున గోదావరి నది నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలించాలి. దీనివల్ల సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న రాయలసీమ, పాలమూరు, నల్గొండ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నీటి గోస తీరుతుంది. పోలవరం నుంచి వేలేరు ద్వారా విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకుపోవాలి. వంశధార, నాగావళి నదుల నీళ్లను కూడా సముద్రం పాలు కాకుండా సమర్థంగా వినియోగిస్తే తమకు నీళ్లు రావడం లేదని, తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే ఉత్తరాంధ్ర వాసుల బాధ కూడా తీరుతుంది’’ అని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు.
సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ బృందంతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో లంచ్ భోజనం చేశారు.

