తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది

తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని విజయాలను 8 ఏండ్లలో సాధించామన్నారు. అందుకే తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికంగా మారిందన్నారు. పెరిగిన ఆదాయంలో ప్రతిపైసా రాష్ట్రాభివృద్ధికి వినియోగిస్తున్నామని చెప్పారు. ఆదాయ వనరులను పెంచుకుని..రికార్డుస్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించామన్నారు. దేశ వార్షిక వృద్ధిరేటు కంటే రాష్ట్ర వార్షిక వృద్ధి రేటు అధికమన్నారు. కరోనా విపత్తులోనూ తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోయిందన్నారు. కరెంట్ కష్టాలకు చమరగీతా పాడామని..24 గంటలు నిరంతర నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ ను అందజేస్తున్నామన్నారు. నల్లగొండకు ఫ్లోరైడ్ పీడిత సమస్యను తీర్చామని స్పష్టం చేశారు. 

జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రికార్డుస్తాయిలో పెరుగుదల సాధించామన్నారు. మిషన్ భగీరధతో ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. అలాగే రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. అన్నదాతలకు సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. కల్లీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణలో వ్యవసాయం దండుగ కాదు..పండుగ అని నిరూపించామని చెప్పారు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం  ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ కాకతీయ గొలుసుకట్టు చెరువులను పునరుద్దరణ చేశామన్నారు. అందుకే వేసవిలో కూడా చెరువులు జలకళను సంతరించుకున్నాయని చెప్పారు. చెరువుల్లో నీరు సంవృద్ధిగా ఉండటంతో చేపల పెంపకం పెరిగిందన్నారు. ఫలితంగా మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారన్నారు. 

పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తిగా చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. యుద్ధప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టు ను మూడేళ్లలో పూర్తి చేశామన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 85 లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని..కోటి ఎకరాలకుపైగా సారునీరు అందించడమే ధ్యైయంగా ముందుకుసాగుతున్నామని చెప్పారు. దళితుల కోసం దళిత బంధు పథకాన్ని సామాజిక ఉద్యమంగా అమలు చేస్తున్నామన్నారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. 

గూడులేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందజేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే 2లక్షల 91 వేల డబుల్ బెడ్ రూమ్  ఇండ్లు మంజూరు చేశామన్నారు. సొంత స్థలం కలిగిన వారికి..డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణానికి దశల వారీగా 3 లక్షలు మంజూరు చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని..చివరి లబ్ధిదారుడికి  అందే వరకు ఈ పథకం కొనసాగిస్తామన్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగం వికాసానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. అందుకే దేశంలో అత్యధికంగా 978 గురుకుల విద్యాలయాలు కలిగిన రాష్ట్రం తెలంగాణే అన్నారు. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా సమగ్ర శిక్షణ ఇస్తున్నామన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను  తీర్చిదిద్దేందుకు మన ఊరు, మన బడి కార్యక్రమానికి నాంది పలికామన్నారు. 

తెలంగాణ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు కేసీఆర్. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచామని స్పష్టం చేశారు. 57 వైద్య పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నస్టిక్స్ కేంద్రాలు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారి కోసం 42 ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచామన్నారు. 56 వేల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 18 ప్రభుత్వ దవాఖాల్లో 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని..సర్కార్ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచడంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. కేసీఆర్ కిట్ పథకం ద్వారా 13 లక్షల 30 వేల మంది మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. దీంతో మాతా, శిశు మరణాల సంఖ్య తగ్గిందన్నారు. బస్తీ దవాఖానాల స్పూర్తితో గ్రామాల్లో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నామని తెలిపారు కేసీఆర్. తెలంగాణ ప్రాంతంలో గతంలో మూడు వైద్య కళాశాలలే ఉన్నాయని..రాబోయే రెండేళ్లలో జిల్లాకు ఒకటి వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేసీఆర్ చెప్పారు.