మళ్లా 6 వేల కోట్ల అప్పు 

మళ్లా 6 వేల కోట్ల అప్పు 

3 నెలల్లో రూ.6,572 కోట్లు 
ఆర్బీఐకి రాష్ట్ర సర్కార్ ఇండెంట్  
2022‑23లో మొత్తం 34 వేల కోట్ల అప్పు 

రాష్ట్ర సర్కారు మళ్లీ అప్పు తెచ్చేందుకు రెడీ అయింది. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో రూ.6,572 కోట్లు అప్పు కావాలని ఆర్బీఐని కోరింది. గత ఏప్రిల్​ నుంచి డిసెంబర్​ వరకు ఆర్బీఐ నుంచి సర్కారు 28 వేల కోట్లు అప్పు తీసుకుంది.

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో స్కీమ్​లు అమలు చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా, చివరికి పాత అప్పులకు వడ్డీలు కట్టాలన్నా రాష్ట్ర సర్కార్ అప్పులపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు మళ్లీ అప్పు తెచ్చేందుకు రెడీ అయింది. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో రూ.6,572 కోట్లు అప్పు కావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. ఏ నెల ఎంత అప్పు కావాలనే ఇండెంట్ ను ఆర్బీఐకి సమర్పించింది. ప్రతి నెల యావరేజ్​గా రూ.2 వేల కోట్లు అప్పు తీసుకోనుంది. రెండు వారాలకోసారి రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే బాండ్ల వేలం ద్వారా ఈ కొత్త అప్పు తెచ్చుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఏప్రిల్ నుంచి డిసెంబర్​వరకు ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.28 వేల కోట్లు అప్పు తీసుకుంది. ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న దానితో మొత్తం అప్పు రూ.34 వేల కోట్లు దాటనుంది.