ఆర్టీసీ బాగుపడడానికి సలహాలిచ్చా: 67% జీతాలు పెంచా

ఆర్టీసీ బాగుపడడానికి సలహాలిచ్చా: 67% జీతాలు పెంచా
  • ఆర్టీసీ గురించి నా కన్నా బాగా ఎవరికీ తెలియదు: కేసీఆర్

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు నాలుగేళ్ల వ్యవధిలో 67 శాతం జీతాలు పెంచామని, మళ్లీ గొంతెమ్మకోర్కెలు అడగడంలో అర్థం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయడం అయ్యే పని కాదని స్పష్టం చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితం వచ్చాక తెలంగాణ భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ గురించి తనకన్నా బాగా ఎవరికీ అవగాహన లేదని ఆయన అన్నారు. తాను మూడేళ్ల పాటు రవాణా శాఖ మంత్రిగా పనిచేశానని, ఆర్టీసీ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పారు కేసీఆర్. నాడు రవాణా మంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయానికి ఆ సంస్థ 13.8 కోట్ల నష్టంలో ఉందని, పక్షి తిరిగినట్లు తిరిగి కష్టం చేసి తాను దాన్ని అదనంగా 14 కోట్ల లాభాల్లోకి తెచ్చానని గుర్తు చేశారు. ఏడాదిన్నర లోపు ఇది సాద్యమైందని చెప్పారు.

అందరూ అదే దారిపడితే ఎలా చేయాలే

తాను ముఖ్యమంత్రినయ్యాక ఆర్టీసీ డీఎంలు, ఆర్ఎంలు, ఈడీలు అందర్నీ పిలిచి ఒక రోజంతా మాట్లాడనని, ఎలా చేస్తే సంస్థ బాగుపడుతుందన్న దానిపై సలహాలు ఇచ్చానని కేసీఆర్ అన్నారు. ఆ రోజే వారికి 44 శాతం ఐఆర్ పెంచామని తెలిపారు. మళ్లీ ఎన్నికల ముందు వచ్చి అడిగితే, కష్టమైనా 14 శాతం పెంచామని అన్నారు. కేవలం నాలుగేళ్ల గ్యాప్ లో ఆర్టీసీ కార్మికులకు 67 శాతం జీతాలు పెంచిన ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటే ఉందని చెప్పారు కేసీఆర్. ఇంత పెంచాక కూడా గొంతెమ్మ కోర్కెలు కోరడంలో అర్థం ఉందా అని ప్రశ్నించారాయన. ఎవరు పడితే వాళ్లొచ్చి ప్రభుత్వంలో కలపమంటే ఎలా అని, రాష్ట్రంలో 57 కార్పొరేషన్లు ఉన్నాయని, ఆర్టీసీని విలీనం చేస్తే అందరూ అదే దారి పడితే ఏం చేయాలే అని అడిగారు సీఎం కేసీఆర్.