దేశ రాజకీయాల్లో మార్పు తప్పదు 

దేశ రాజకీయాల్లో మార్పు తప్పదు 
  • దేశంలో ఎవ్వరూ సంతోషంగా లేరు  
  • బెంగళూరులో దేవెగౌడ, కుమారస్వామితో సుదీర్ఘ చర్చలు
  • ప్రధాని రాకకు ముందే కర్నాటకకు సీఎం పయనం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ : రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కచ్చితంగా మార్పులు వస్తాయని, వాటిని ఎవ్వరూ ఆపలేరని సీఎం కేసీఆర్ అన్నారు. రెండు మూడు నెలల్లో ప్రజలు సంచలన వార్త వింటారని చెప్పారు. కర్నాటక రాష్ట్రానికి కుమారస్వామి సీఎం అవుతారని గతంలో తాను చెప్పానని, అది జరిగిందన్నారు. ఇప్పుడు కూడా జాతీయ రాజకీయాల విషయంలోనూ తాను చెప్పేది కచ్చితంగా జరుగుతుందన్నారు. గురువారం ఉదయం కేసీఆర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడను ఆయన నివాసంలో కలిశారు. అక్కడ దేవెగౌడ, ఆయన కొడుకు కుమార స్వామితో భేటీ అయ్యారు. చర్చల తర్వాత కుమారస్వామి, కేసీఆర్ కలిసి మీడియాతో మాట్లాడారు. 

దేశంలో పరిస్థితులు దిగజారుతున్నయ్
‘‘అధికారంలోకి ఎవరొస్తరు.. ఎవరు పోతారనేది పెద్ద విషయం కాదు. ఎంతో మంది ప్రధానులు మారినా దేశాభివృద్ధి జరగలేదు. ఓ వైపు 75 ఏండ్ల స్వాతంత్ర్య సంబురాలు జరుపుకుంటుంటే, మరో వైపు ఇప్పటికీ సాగు, తాగు నీటి కోసం, కరెంట్ కోసం దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దేశంలో పరిస్థితులు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. ధరలు పెరుగుతున్నయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోతోంది. నిరుద్యోగం పెరిగింది. జీడీపీ తగ్గుతోంది. రైతులు, గిరిజనులు, దళితులు సహా దేశంలో ఎవ్వరూ సంతోషంగా లేరు” అని కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు మన కంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా, ఇప్పుడు  ఆర్థికంగా ప్రపంచాన్ని శాసిస్తోందని కేసీఆర్​ అన్నారు. మోడీ ప్రభుత్వం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ప్రచారం చేసుకుంటుండటం, దేశానికి అవమానకరం అన్నారు. మన దేశంలో కావాల్సినన్ని వనరులు ఉన్నాయని, యువశక్తి, అన్నిరకాలుగా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ గుర్తుచేశారు. వాటిని సరిగ్గా వినియోగించుకుంటే అమెరికా కంటే ముందు ఉంటామన్నారు. కుమారస్వామి మాట్లాడుతూ, దేశ ప్రస్తుత పరిస్థితి, రాజకీయాలు, దేశాన్ని కాపాడుకునేందుకు ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించామన్నారు. కేసీఆర్ సంచలన ప్రకటనపై.. రిపోర్టర్లు ప్రశ్నించగా, మూడు నెలల తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయన్నారు. 

పీఎం రావడానికి ముందే 
ప్రధాని మోడీ హైదరాబాద్‌‌ రావడానికి కొన్ని గంటల ముందు సీఎం కేసీఆర్ బెంగళూరు పయనమయ్యారు. గురువారం ఉదయం 10 గంటలకు బేగంపేట్ ఎయిర్‌‌‌‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. సీఎం వెంబడి ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, జాజల సురేందర్, కృష్ణమోహన్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్నారు. 11 గంటలకు బెంగళూరు చేరుకున్న కేసీఆర్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ నుంచి లీలా ప్యాలస్ హోటల్‌‌కు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడి నుంచి దేవెగౌడ ఇంటికి వెళ్లారు. దేవేగౌడ, కుమారస్వామి, కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ తదితరులు కేసీఆర్‌‌‌‌ బృందానికి ఆహ్వానం పలికారు. చర్చల అనంతరం దేవెగౌడ ఇంట్లోనే లంచ్ చేశారు. షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి బెంగళూరులోనే ఉండి, శుక్రవారం మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి వెళ్లి అన్నాహజారేతో భేటీ కావాల్సి ఉంది. కానీ, గురువారం సాయంత్రమే కేసీఆర్ హైదరాబాద్‌‌ చేరుకున్నారు.

కేసీఆర్‌‌‌‌ను కలిసిన తెలంగాణ బీసీ కమిషన్
బెంగళూరు వచ్చిన సీఎం కేసీఆర్‌‌‌‌ను తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిషోర్ గౌడ్ కలిశారు. రెండ్రోజులుగా రిజర్వేషన్లపై కర్నాటకలో స్టడీ చేసిన అంశాలను ఆయనకు వివరించారు. మరో రెండ్రోజులు కర్నాటకలోనే ఉండి పలువురిని కలుసుకోనున్నట్టు కేసీఆర్‌‌‌‌కు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం : -

కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు


మూఢనమ్మకాలు నమ్మేవాళ్లు తెలంగాణను ఉద్ధరించలేరు