19 జిల్లాల్లో కొత్తగాడయాగ్నస్టిక్ సెంటర్లు
జిల్లా ఆస్పత్రుల్లో రేపు ప్రారంభం
అందుబాటులోకి 57 రకాల టెస్టులు
హైదరాబాద్, వెలుగు: ట్రీట్మెంట్ కంటే టెస్టుల ఖరీదే ఎక్కువవుతోందని, వైద్యం కోసం ఆస్తులమ్ముకునే దుస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రైవేట్ఆస్పత్రుల్లో జనం టెస్టుల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా హాస్పిటళ్లలో వీటిని సోమవారం నుంచి ప్రారంభించాలని సూచించారు. కరోనా కేసులు, వైద్య సేవలపై అధికారులతో సీఎం శనివారం ఫోన్‌లో మాట్లాడారు. ప్రజలకు ఉచిత వైద్యం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నామని, అన్ని రకాల వైద్య సేవలను
అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
సీఎం ఆదేశాల మేరకు మహబూబాబాద్, భద్రాద్రి, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో సోమవారం నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. మిగతా ఆరు కేంద్రాలను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ పథకానికి త్వరలోనే మంచి పేరు పెడతామని సీఎం తెలిపారు. ఈ సెంటర్లలో 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, పరీక్షల రిపోర్టులను పేషెంట్ల సెల్ ఫోన్‌కు పంపిస్తామన్నారు. పీహెచ్‌సీకి వచ్చే రోగులకు ఏ పరీక్షలు అవసరమో డాక్టర్ సూచిస్తారని, అక్కడే శాంపిళ్లు తీసి జిల్లా డయాగ్నోస్టిక్ కేంద్రానికి పంపితే టెస్టులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి హాస్పిటళ్లలో ఏర్పాటు చేసినట్టుగానే జిల్లా డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఆధునిక, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ యంత్రాలు అందుబాటులో ఉంచామన్నారు. ఫుల్లీ ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ, ఇమ్యూనో అస్సే, యూరిన్ అనలైజర్, సెల్ కౌంటర్, ఎలీసా రీడర్‌తోపాటు ఈసీజీ, టుడీ ఇకో, ఆల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే తదితర యంత్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటితోపాటు సీటీ స్కానింగ్ మిషిన్లను దశల వారీగా ఏర్పాటు చేస్తామన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు.
