డిక్టేటర్​లా కేసీఆర్ పాలన.. విద్యా వ్యవస్థను నాశనం చేశారు: ప్రొఫెసర్​ హరగోపాల్

డిక్టేటర్​లా కేసీఆర్ పాలన.. విద్యా వ్యవస్థను నాశనం చేశారు: ప్రొఫెసర్​ హరగోపాల్
  • నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర ముగింపు   

ఖైరతాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ మాట్లాడేది వినడమే తప్ప తిరిగి చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర  ప్రజలు ఉన్నారని, ఆయన ఒక డిక్టేటర్ లా పాలిస్తున్నారని ప్రొఫెసర్​హరగోపాల్ అన్నారు. నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర ముగింపు సభ శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగింది. ఈ నెల15న గన్​పార్కు వద్ద ప్రారంభమైన బస్సు యాత్ర  వివిధ జిల్లాల్లోని 90  నియోజకవర్గాలను చుట్టి వచ్చింది. నిరుద్యోగుల బస్సుయాత్రకు ముందుగా కాంగ్రెస్​జాతీయ నేతలు అల్కా లాంబ, అజయ్​కుమార్, కోదండరెడ్డి, సినీనటి దివ్యవాణి, ఎన్ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్​స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో హరగోపాల్​మాట్లాడారు. తెలంగాణ సాధనలో విద్యార్థులు ముఖ్య పాత్ర వహించారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో వారికి ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. వర్సిటీల్లో ఫ్యాకల్టీ లేరని, నాణ్యమైన విద్యకు విద్యార్థులు దూరమయ్యారన్నారు.

తెలంగాణలోనే ఎక్కువ నిరుద్యోగం: కన్హయ్య కుమార్

తెలంగాణ అంటే టీ హబ్​అంటున్నారని, అక్కడ తెలంగాణ నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెబుతారా కేటీఆర్.. అంటూ ఎన్ఎస్ యూఐ జాతీయ ఇన్ చార్చి కన్హయ్య కుమార్ ప్రశ్నించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా నిరుద్యోగుల సంఖ్య తెలంగాణలోనే 15 శాతం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్​పీఎస్​సీ ప్రక్షాళన చేస్తామని, 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.  బస్సు యాత్ర కన్వీనర్ ప్రొఫెసర్ రియాజ్ మాట్లాడుతూ.. ఇది ముగింపు సభ కాదని​ఆరంభమన్నారు. బీఆర్ఎస్​ను ఓడించే వరకు విశ్రమించేది లేదన్నారు.