న్యూఢిల్లీ: అమెరికాను సంతోషపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలో బలవంతంగా ఈ20 పెట్రోల్ తీసుకొచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ20 పెట్రోల్‌ను వ్యతిరేకిస్తూ తయారు చేసిన ఆన్‌లైన్ వినతి పత్రంపై 2 లక్షల మందికి పైగా జనం సంతకాలు చేశారని తెలిపారు. లాఠీ దెబ్బలకు భయపడని వంద మందితో కలిసి ఈ నెల 4న ప్రధాని ఇంటిని ముట్టడిస్తామన్నారు. ఈ నిరసన మార్చ్ ద్వారా తమ వినతి పత్రాన్ని ప్రధాని మోదీకి అందజేస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు.
శనివారం ఆయన ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన జాతీయ టౌన్ హాల్ సమావేశంలో మాట్లాడారు. పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు స్వచ్ఛమైన పెట్రోల్ లేదా ఈ20 పెట్రోల్ ఎంచుకునే అవకాశం కల్పించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ20 పెట్రోల్ కంటే స్వచ్ఛమైన పెట్రోల్ ధర తక్కువగా ఉండాలన్నారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.
