కేజ్రీవాల్‌‌ను సీఎంగా తొలగించలేం

కేజ్రీవాల్‌‌ను సీఎంగా తొలగించలేం
  •  జైలు నుంచి పాలన సాగించేందుకు చట్టపరంగా అడ్డంకుల్లేవు: ఢిల్లీ హైకోర్టు

అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగేందుకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకుల్లేవని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. లిక్కర్ స్కామ్​లో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసినందున ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని సుర్జీత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై గురువారం ఢిల్లీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్​ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా బెంచ్ విచారించింది. ఈ అంశాన్ని పాలన విభాగం, రాష్ట్రపతి పరిశీలించాలని.. దీనిపై కోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. 

‘‘న్యాయపరమైన జోక్యానికి ఆస్కారం ఉందా? ఈ సమస్యను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పరిశీలిస్తున్నట్లు పత్రికల్లో చదివాం. ఈ అంశం తర్వాత రాష్ట్రపతి ముందుకు వెళ్తుంది. రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి, ఎల్జీకు ఎలాంటి సూచనలు చేయలేం’’ అని బెంచ్ తేల్చి చెప్పింది. కేజ్రీవాల్ సీఎంగా కొనసాగకుండా నిషేధం విధించే అంశాలు ఏమైనా ఉంటే చెప్పాలని పిటిషనర్ ను కోరింది. ఏదైనా రాజ్యాంగ వైఫల్యం ఉంటే రాష్ట్రపతి లేదా గవర్నర్ దానిపై చర్య తీసుకుంటారని తెలిపింది. ప్రస్తుత పరిస్థితి ఎప్పుడూ ఊహించని విషయమని పేర్కొంది.