సత్యమే గెలిచింది ..అత్యంత నిజాయతీపరుడని రుజువైంది: కేజ్రీవాల్

సత్యమే గెలిచింది ..అత్యంత నిజాయతీపరుడని రుజువైంది: కేజ్రీవాల్
  •     కోర్టు బయట మీడియా ముందు కేజ్రీవాల్ కంటతడి
  •     ఆప్​ నేతలనూ వేధించారంటూ భావోద్వేగం
  •     వాటిని మౌనంగా భరించానన్న  ఢిల్లీ మాజీ సీఎం

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను కట్టర్ ఇమాందార్(అత్యంత నిజాయతీపరుడు)అని రుజు వైందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేషనల్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం కోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. కేజ్రీవాల్ ను పక్కనే ఉన్న మనీశ్ సిసోడియా హత్తుకుని ఓదార్చారు. ఈ దృశ్యాలు రౌస్ అవెన్యూ కోర్టు బయట అందరినీ కదలించాయి. ‘‘నేను కట్టర్ఇ మాందార్(నిజాయతీపరుడు) నని ఈరోజు నిరూపితమైంది. సత్యమే గెలిచింది. కేంద్ర  సర్కార్ దేశంలోని అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యలపై పోరాడాల్సింది పోయి ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు చేస్తున్నది. ఇకనుంచైనా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం ఆపండి. నాతో సహా మా పార్టీ నేతలను చాలా వేధించారు. టీవీ చానెళ్లలో చర్చలు జరిపారు. కేజ్రీవాల్ అవినీతిపరుడని కట్టుకథలు ప్రచారం చేశారు. ఇంతకాలం వాటిని భరించాను. కానీ తీర్పు వచ్చాక కన్నీళ్లను ఆపుకోలేకపోయాను" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

బీజేపీ 10 సీట్లు గెలిచినా రాజకీయ సన్యాసం

కోర్టు తీర్పు తర్వాత బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో ప్రధాని మోదీకి, బీజేపీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు."ఢిల్లీలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టండి. బీజేపీ 10 సీట్లు గెలిచినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా" అని చాలెంజ్  చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద రాజకీయ కుట్ర అని అభివర్ణించిన ఆయన.. అక్రమ కేసులతో తమను ఇబ్బంది పెట్టిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.