KC వేణుగోపాల్ ఔట్.. కేరళ సీఎంగా వీడీ సతీశన్ ఫిక్స్.. లాస్ట్ మినిట్లో ఏం జరిగిందంటే..

KC వేణుగోపాల్ ఔట్.. కేరళ సీఎంగా వీడీ సతీశన్ ఫిక్స్.. లాస్ట్ మినిట్లో ఏం జరిగిందంటే..

కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కేరళ సీఎం రేసులో కాంగ్రెస్​ పార్టీ సీనియర్ ​లీడర్లు వీడీ సతీశన్, రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్, శశి థరూర్ సహా మరికొందరి పేర్లు వినిపించాయి.

ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్ను కాంగ్రెస్ అధిష్టానం కేరళ ముఖ్యమంత్రిగా ఖరారు చేసింది. కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒక తీర్మానం చేసి ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ హైకమాండ్‌కు అప్పగిస్తారు.

ఈ క్రమంలో.. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం ఏకే ఆంటోనీ అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ కొత్త సీఎం ఎంపికలో కీలక పాత్ర పోషించారు. కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్ తుది రేసులో నిలిచారు. కేసీ వేణుగోపాల్ పేరు కేరళ సీఎంగా దాదాపు ఖరారైనట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ.. వీడీ సతీశన్ కేరళ సీఎంగా బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ అధిష్టానం గురువారం అధికారికంగా ప్రకటించింది.

చివరి క్షణం వరకు కేసీ వేణుగోపాల్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్ హైకమాండ్ వీడీ సతీశన్ వైపే మొగ్గు చూపింది. సతీశన్కు ప్రజా మద్దతు ఉండటం.. ప్రజల్లో ఉన్న పాపులారిటీ.. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఆయన చేసిన పోరాటం.. 50 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలతో ఆయనకు ఉన్న సంబంధాలు.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న రాహుల్ గాంధీ.. వీడీ సతీశన్ను సీఎంగా ఎంపిక చేశారు. UDF కూటమిలోని మిత్ర పక్ష పార్టీలు అన్నీ సతీశన్ వైపు ఓటు వేశాయి. కేరళ రాష్ట్రానికి చెందిన ముగ్గురు పార్టీ మాజీ అధ్యక్షులు కూడా సతీశన్ వైపు మొగ్గు చూపారు.

కేసీ వేణుగోపాల్కు కాంగ్రెస్ పార్టీలోని ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ.. మిత్ర పక్ష పార్టీల్లో.. ప్రజాభిమానంలో సతీశన్కు ఎక్కువ మద్దతు రావటంతో.. 11 రోజుల సస్పెన్స్కు తెర దించుతూ కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నది. మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో, యూడీఎఫ్ 102 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది. 

ఇందులో ఒక్క కాంగ్రెస్ పార్టీయే 63 స్థానాలను గెలుచుకోవడం విశేషం. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యంగా మలబార్ రీజియన్‌‌లో ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్‌‌) తో కలిసి కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది.