దేశంలో కమ్యూనిస్టుల పాలన ఖతం.. చేజారిన కేరళం!

దేశంలో కమ్యూనిస్టుల పాలన ఖతం.. చేజారిన కేరళం!

కేరళలో దశాబ్దాలుగా పాతుకుపోయిన ఎర్ర జెండా రెపరెపలు ఇప్పుడు కనుమరుగు అవుతున్నాయా ? తాజా ఎన్నికల సరళి చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్నటి వరకు ఎదురులేకుండా పాలించిన కమ్యూనిస్ట్ పార్టీ(LDF), ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి దిశగా పయనిస్తుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని UDF అనూహ్య ఆధిక్యంలోకి రావడంతో సోషల్ మీడియా వేదికగా కమ్యూనిస్టులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియాలో 'రెడ్ ఫేర్వెల్'..
ఫలితాల ట్రెండ్స్ బయటకు వచ్చిన క్షణం నుండే ఎక్స్, ఫేస్‌బుక్ వంటి మాధ్యమాల్లో దేశంలో కమ్యూనిస్టుల పాలన ఖతం అనే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "బెంగాల్ అయిపోయింది.. త్రిపుర చేజారింది.. ఇప్పుడు కేరళ కూడా కమ్యూనిస్టుల కంచుకోట కాదు" అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. 

కమ్యూనిస్టుల వెనకడుగు
కేరళ రాజకీయ చరిత్రలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుందనే సంప్రదాయాన్ని గత ఎన్నికల్లో బ్రేక్ చేసిన కమ్యూనిస్టులు.. ఈసారి మాత్రం ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నట్లు కనిపిస్తోంది. పినరయి విజయన్ పాలనపై ఉన్న అసంతృప్తి, స్థానిక అంశాలు కాంగ్రెస్‌కు ప్లస్‌గా మారాయి. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(UDF) క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుండటంతో.. కేరళలో వామపక్షాల సుదీర్ఘ ప్రస్థానానికి తాత్కాలికంగా తెరపడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి దక్షిణ భారతంలో కమ్యూనిస్టులకు ఏకైక చిరునామాగా ఉన్న కేరళలో ఈ పరాజయం.. దేశవ్యాప్తంగా ఆ పార్టీ మనుగడపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఫలితాలు కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా, భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసిందనే సంకేతాలను ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.