క్షమించు తల్లీ.. కేరళలో అత్యాచార బాధితురాలికి పోలీసుల సారీ

క్షమించు తల్లీ.. కేరళలో అత్యాచార బాధితురాలికి పోలీసుల సారీ

కొచ్చి: ఐదేండ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనకు కేరళ పోలీసులు సారీ చెప్పారు. బీహార్ నుంచి వలస వచ్చిన కూలీల కూతురు కిడ్నాప్ అయిందన్న సమాచారంతో రాత్రంతా గాలించామని, ఎర్నాకుళంలోని డంప్ యార్డ్ లో మరుసటిరోజు ఆ చిన్నారి డెడ్​బాడీ దొరికిందని తెలిపారు. ‘‘నిన్ను ప్రాణాలతో తల్లిదండ్రుల దగ్గరి తీసుకురావాలని మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సారీ తల్లీ” అని పోలీసులు ట్వీట్ చేశారు. అయితే, నిందితుడిని అరెస్ట్ చేశామని, కిడ్నాప్ చేసిన వ్యక్తే ఆమెపై అత్యాచారం చేసి గొంతునులిమి చంపేశాడని వెల్లడించారు. 

ఇది పోలీసుల ఫెయిల్యూర్: కాంగ్రెస్ ఆరోపణ

ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. బాలిక కిడ్నాప్ అయిందని తెలిసినా గుర్తించడంలో రాష్ట్ర పోలీసులు ఫెయిల్ అయ్యారని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. ‘‘బాలిక మధ్యాహ్నం 3 గంటలకు కనిపించకుండా పోయింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆమెపై అత్యాచారం, హత్య జరిగింది. రాత్రి 7.10 గంటలకు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. 8 గంటలకు ఎఫ్​ఐఆర్ ఫైల్ చేసి నిందితుడిని 9 గంటలకు అరెస్ట్  చేశాం” అని వివరణ ఇచ్చారు. అతడు పీకలదాకా తాగి ఉన్నందుకు వివరాలేమీ చెప్పలేకపోయాడని, శనివారం ఉదయాన్నే చిన్నారి డెడ్​బాడీని గుర్తించామని చెప్పారు. 

అత్యాచారం, హత్య.. గోనె సంచిలో డెడ్​బాడీ

కొచ్చిలోని అలువా ప్రాంతంలో బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలు నివాసం ఉంటున్నారు. అందులో ఒకరి ఐదేండ్ల కూతురిని బీహార్​కు చెందిన కూలీయే శుక్రవారం కిడ్నాప్ చేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, గొంతునులిమి చంపేశాడు. డెడ్​బాడీని గోనె సంచీలో కట్టి డంపింగ్ యార్డులో పడేశాడు. కాగా, చిన్నారి అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. వందలాది మంది వచ్చి నివాళి అర్పించారు. మృతదేహాన్ని ఖననం చేస్తుండగా కన్నీటిపర్యంతమయ్యారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని నినాదాలు చేశారు.