గ్రేట్ ఇండియన్.. పాస్ పోర్ట్ ను నీకంటే ఎవరూ బాగా వాడలేరేమో..

గ్రేట్ ఇండియన్.. పాస్ పోర్ట్ ను నీకంటే ఎవరూ బాగా వాడలేరేమో..

మొబైల్ పరికరాల విజృంభణకు చాలా కాలం ముందు, టెలిఫోన్‌లు, ఫోన్ బూత్‌లు, పేఫోన్‌లు లాంటివి ఉన్నాయి. ఇప్పుడంటే ఆండ్రాయిడ్, ఐఫోన్ సిస్టమ్‌లలో ఫోన్ నంబర్లను సులభంగా ఫీడ్ చేసుకోగల్గుతున్నాం. కానీ ఆ రోజుల్లో అలాంటి టెక్నాలజేం లేదు. చాలా మంది ఫోన్ నంబర్లను ఓ ఫోన్ డైరీ-కమ్-ఖాతా పుస్తకాన్ని కలిగి ఉండేవారు. అందులో బంధువుల, స్నేహితుల, కావల్సిన వారి నంబర్లు, నెలవారీ ఖర్చులు, బడ్జెట్ వివరాలు రాసుకునేవారు. ఇప్పుడు, Xలో షేర్ అవుతున్న ఒక వీడియో ఆ యుగాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది. రెన్యూవల్ కోసం ఓ వ్యక్తి పాస్‌పోర్టును ఓ అధికారి తనిఖీ చేస్తుండగా ఈ విషయం బయటపడింది. ఎక్కువగా విదేశాలకు వెళ్లే వారు తప్ప, మిగతా వారికి పాస్‌పోర్ట్ పేజీలు చాలా వరకు రెన్యూవల్ సమయంలో వృథా అవుతాయని అందరికీ తెలిసిందే. దాన్నే ఈ వ్యక్తి కాంటాక్ట్స్ సేవ్ చేసుకునే స్టోరేజీ బుక్ లా చేశాడు. వివరాల్లోకి వెళితే..

పాస్‌పోర్టును టెలిఫోన్ డైరెక్టరీగా మార్చుకున్న ఓ వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోన్ నంబర్లు, పేర్లతో నిండిన తన పాస్‌పోర్ట్ పేజీలను ఓ వ్యక్తి తిప్పేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. కేరళకు చెందిన ఈ అజ్ఞాత వ్యక్తి తమ పాస్‌పోర్ట్‌ను పాకెట్ డైరీగా మార్చుకుంటాడని ఎవరు మాత్రం ఊహిస్తారు?. కానీ ఇక్కడ అదే జరిగింది. "కేరళలోని పాస్‌పోర్ట్ అధికారి రెన్యూవల్ కోసం వచ్చిన వ్యక్తి పాస్‌పోర్ట్‌ను చూసిన తర్వాత షాక్ నుండి ఇంకా కోలుకోలేదు", 100% అక్షరాస్యత రేటు ఫలితం అని పలు క్యాప్షన్ లతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇటి నెటిజన్ల దృష్టిని సైతం విపరీతంగా ఆకర్షిస్తోంది.  చాలామంది దీనిని "పర్యావరణ అనుకూలమైన" చర్యగా తెలిపారు. "ఎవరైనా ఈ పాస్‌పోర్ట్‌తో ప్రయాణించి, ఇమ్మిగ్రేషన్ అధికారి దానిపై స్టాంప్ చేయవలసి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. “ఇది అందుబాటులో ఉన్న వనరులతో సరైన వినియోగం, పర్యావరణాన్ని కాపాడుతున్నందుకు ఈ వ్యక్తికి నోబెల్ బహుమతి ఇవ్వాల"ని మరికొందరు అన్నారు. "ఈ వ్యక్తి 'చెట్లను రక్షించు', రీసైకిల్, పునర్వినియోగం వంటి మార్గాలను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది" అని ఇంకొందరు అన్నారు. పాస్ పోర్టు అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని తప్పుగా నిర్వహించినందుకు వ్యక్తికి తగిన విధంగా జరిమానా విధించబడిందని ఆశిస్తున్నాను అని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.