కేరళ బస్సు వీడియో కేసు: ఇన్‎ఫ్లూయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్

కేరళ బస్సు వీడియో కేసు: ఇన్‎ఫ్లూయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్

తిరువనంతపురం: దీపక్ అనే వ్యక్తి బస్సులో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఇన్‎ఫ్లూయెన్సర్ షింజితా ముస్తఫా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాను అలాంటి వాడిని కాదని.. ఈ అవమానాన్ని తట్టుకోలేనంటూ ప్రాణాలు తీసుకున్నాడు. 

మృతుడి తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు దీపక్‎ను ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలపై ముస్తఫాపై కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దీపక్ ఆత్మహత్య కేసులో బుధవారం (జనవరి 21) షింజితా ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను మంగళం మేజిస్ట్రేట్ ముందు పర్చగా ముస్తాఫాకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.  

కేరళలోని కోజికోడ్‌లో దీపక్ (42) అనే సేల్స్ మెన్ ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. జర్నీ టైమ్‎లో బస్సులో దీపక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇన్‎ఫ్ల్యూయెన్సర్ షింజితా ముస్తఫా వీడియో తీసి జనవరి 16న సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‎గా మారడంతో దీపక్‎పై విమర్శలు వెల్లువెత్తాయి. 

దీంతో తాను అటువంటి వాడిని కాదని.. అవమానభారం భరించలేక దీపక్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానస్పద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో కేరళలో తీవ్ర దుమారం రేపుతుండటంతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం (జనవరి 21) నిందితురాలు షింజితా ముస్తాఫాను అరెస్ట్ చేశారు.