విద్యా కమిషన్ ఇచ్చింది నివేదిక మాత్రమే! : ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు

విద్యా కమిషన్ ఇచ్చింది నివేదిక మాత్రమే! : ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు
  •     దీనిపై ఇంకా కసరత్తు జరగాల్సి ఉంది: కే కేశవరావు
  •     వేతనాల పెంపు ఉంటుంది గానీ.. తగ్గింపు ఉండదని వెల్లడి
  •     రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న విద్యావేత్తలు, వక్తలు

పంజాగుట్ట, వెలుగు: ఎడ్యుకేషన్ పాలసీపై విద్యా కమిషన్ ఇటీవల ఇచ్చింది నివేదిక మాత్రమేనని ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు అన్నారు. ఈ నివేదికను 20 రోజుల్లో పబ్లిక్ డొమైన్‌‌లో ఉంచుతామన్నారు. ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి వచ్చే సలహాల మేరకు మార్పులు చేసి తుది రూపు ఇస్తామన్నారు. ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. జీతాల తగ్గింపు ఉండదని హామీ ఇచ్చారు. 

శుక్రవారం ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్‌‌లో 'నూతన విద్యా పాలసీ - దాని పర్యవసానాలు' అనే అంశంపై సకల జనుల వేదిక, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం సంయుక్తంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. ఇందులో విద్యార్థులపై ఎల్‌‌కేజీ నుంచే బలవంతంగా పరభాషను రుద్దకూడదని, వారి అభిరుచికి తగ్గట్టుగానే భాషా బోధన ఉండాలని పలువురు విద్యావేత్తలు, వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు మాట్లాడుతూ..ఎడ్యుకేషన్ పాలసీపై ముగ్గురు వైస్ ఛాన్స్​లర్​లతో పాటు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యపై పనిచేస్తున్న ఎన్జీవో సంస్థలు, విద్యార్థి సంఘాలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

 'పీపుల్స్ కమిషన్' ఏర్పాటు చేయాలి

రాష్ట్ర నీటిపారుదల శాఖ మాజీ చైర్మన్ వి. ప్రకాశ్ మాట్లాడుతూ..విద్యా వ్యవస్థ మెరుగుదలకు ఒక 'పీపుల్స్ కమిషన్' ఏర్పాటు చేయాలని సూచించారు. మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. బడ్జెట్‌‌లో విద్యకు 18 శాతం నిధులు కేటాయించాలన్న ప్రతిపాదన బాగున్నా అమలవుతుందా అని అనుమానం వ్యక్తం చేశారు. ఉచిత పథకాల కంటే విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మహిళా టీచర్లు సెలవులో ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం చూడాలని టీచర్ల సంఘాల నేత మోహన్ రెడ్డి సూచించారు. 

ప్రభుత్వం కొత్త కాలేజీల్లో అధ్యాపక పోస్టులను మంజూరు చేయటం లేదని లెక్చరర్ల సంఘం నేత మధుసూదన్ రెడ్డి తెలిపారు.అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సలహాదారుడు ఉపేందర్ రెడ్డి కోరారు.  ఫీజు రీయింబర్స్‌‌మెంట్ సకాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ వినాయక రెడ్డి, మధుసూదన్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.