రూ.547 కోట్ల సైబర్ మోసం..ప్రధాన నిందితుడు వికాస్ చౌదరి అరెస్ట్

రూ.547 కోట్ల సైబర్ మోసం..ప్రధాన నిందితుడు వికాస్ చౌదరి అరెస్ట్
  • ‌స్టాక్‌‌మార్కెట్‌‌, ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ అంటూ రూ. 547 కోట్ల ఫ్రాడ్
  • అదుపులోకి తీసుకున్న వీఎం బంజర్‌‌ పోలీసులు
  • ఈ కేసులో ఇప్పటికే 20 మంది వరకు అరెస్ట్‌‌
  • ఫ్రాడ్‌‌ విలువ రూ. వెయ్యి కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ఖమ్మం/పెనుబల్లి, వెలుగు : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రూ.547 కోట్ల సైబర్‌‌ ఫ్రాడ్‌‌ కేసులో ప్రధాన నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదైన రెండు నెలల తర్వాత వీఎం బంజర్‌‌ పోలీసులు వికాస్‌‌ను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. 

సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి, అంతర్జాతీయ నేరగాళ్లతో కలిసి కాల్‌‌ సెంటర్లు ఏర్పాటు చేసి రూ.వందల కోట్ల సైబర్ క్రైమ్‌‌లకు పాల్పడ్డారు. కంబోడియా, హైదరాబాద్‌‌లలో కాల్‌‌సెంటర్లు నిర్వహిస్తూ మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, స్టాక్‌‌ మార్కెట్‌‌లో పెట్టుబడులు, క్రిప్టో ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడేవారు. 

ఓ యువకుడి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు కీలక నిందితుడు పోట్రు ప్రవీణ్‌‌ను గతేడాది డిసెంబర్‌‌లోనే అరెస్ట్ చేయగా, గత నెల  11న మరో 18 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు. తర్వాత ప్రధాన నిందితుడైన వికాస్​ చౌదరి కోసం సత్తుపల్లి, ఖమ్మం, హైదరాబాద్‌‌ సహా పలు నగరాల్లో గాలింపు చేపట్టారు. 

ముందస్తు బెయిల్ కోసం వికాస్​చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు సమాచారం. ఈ క్రమంలోనే వికాస్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో మరో 10 మందికిపైగా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. పోట్రు మనోజ్‌‌ కల్యామ్‌‌ భార్య మేడా భానుప్రియ, బావమరిది మేడా సతీశ్‌‌ ఇంకా పరారీలోనే ఉన్నారు. 

స్కామ్​ బయటపడిందిలా..!

సత్తుపల్లి మండలం తుంబూరుకి చెందిన మోదుగు సాయికిరణ్‌‌కు 2022లో పోట్రు మనోజ్ కల్యాణ్‌‌, పోట్రు ప్రవీణ్, ఉడతనేని వికాస్‌‌చౌదరి, మోరంపూడి చెన్నకేశవ పరిచయమై ఉద్యోగం ఇస్తామంటూ నమ్మించి బ్యాంక్‌‌ అకౌంట్లు ఓపెన్‌‌ చేయించారు. బ్యాంకు ఆన్‌‌లైన్‌‌ అకౌంట్ల వివరాలు సాయికిరణ్‌‌కు ఇవ్వకుండా వారి వద్దే పెట్టుకున్నారు. 

ఆ అకౌంట్ల ద్వారా అనధికారిక లావాదేవీలు జరుగుతుండడంతో అనుమానం వచ్చిన సాయికిరణ్ గతేడాది డిసెంబర్‌‌ 24న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులకు కేసులో ఉన్న తీవ్రత అర్థమైంది. విచారణలో భాగంగా సత్తుపల్లికి చెందిన చాలా మందిని ఇలాగే ఉద్యోగాల పేరుతో నమ్మించి, వారి బ్యాంక్ అకౌంట్లను సైబర్‌‌ క్రైమ్‌‌కు ఉపయోగించుకున్నట్లు గుర్తించారు. 

ఒక్కో సేవింగ్‌‌ అకౌంట్‌‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేలు, కరెంటు అకౌంట్‌‌కు రూ.పది వేల వరకు ఇచ్చి అకౌంట్లను వాడుకున్నట్లు తేలింది. ప్రధాన నిందితుల బ్యాంక్‌‌ అకౌంట్ల నుంచే రూ.547 కోట్ల లావాదేవీలు జరిగినట్టు లెక్క తేలగా.. మరింత మంది ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుండడంతో ఈ స్కామ్‌‌ విలువ రూ.వెయ్యి కోట్లకుపైగా ఉంటుందని సమాచారం.