కేజీ డీ6 లో గ్యాస్‌ ఖాళీ

కేజీ డీ6 లో గ్యాస్‌ ఖాళీ

తమకు ప్రధానమైన కేజీ–డీ 6 బ్లాక్​లో సహజవాయువు నిల్వలు ముగింపు దశకు చేరుకున్నట్లు రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌ ప్రకటించింది. బంగాళాఖాతంలోని ఈ బేసిన్‌‌లో  ఏరోజుకారోజు ఉత్పత్తి తగ్గిపోతోందని తెలిపింది. 2020 మధ్య నాటికి మూడు  కొత్త బ్లాకులను ఉత్పత్తిలోకి తెచ్చే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నట్లు వెల్లడించింది. ధీరూభాయ్‌‌ –1, ధీరూభాయ్‌‌– 3 ఫీల్డ్స్‌‌ ఒకప్పుడు దేశంలోనే అత్యధిక సహజవాయువు ఉత్పత్తిచేసినవిగా పేరు పొందాయి. లో ప్రెజర్‌‌తోపాటు, నీటి ప్రవేశ సంబంధ సవాళ్లు తాజాగా ఎదురవుతున్నట్లు రిలయన్స్‌‌ తెలిపింది. జూన్‌‌ క్వార్టర్‌‌ ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత ఒక ఇన్వెస్టర్‌‌ ప్రజంటేషన్‌‌లో ఈ విషయాలను కంపెనీ వెల్లడించింది.

ఏప్రిల్‌‌ – జూన్‌‌ 2019 క్వార్టర్లో కేజీ డీ 6 బేసిన్‌‌లోని ఫీల్డ్స్‌‌ రోజుకు సగటున 1.76 మిలియన్‌‌ స్టాండర్డ్‌‌ క్యూబిక్‌‌ మీటర్ల సహజ వాయువును ఉత్పత్తి చేసినట్లు పేర్కొంది. కృష్ణా– గోదావరి బేసిన్‌‌లో ఇప్పటిదాకా రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌ మొత్తం 19 చమురు, సహజవాయువు నిక్షేపాలు కనుగొంది. వాటిలో  ఎంఏ ఒక్కటే 2008 సెప్టెంబర్‌‌లో ఉత్పత్తి మొదలు పెట్టింది. డీ1, డీ3 లు ఆ తర్వాత ఏప్రిల్‌‌ 2009 లో ఉత్పత్తి ప్రారంభించాయి. ఎంఏ ఫీల్డ్‌‌లో ఉత్పత్తి కిందటేడాది సెప్టెంబర్‌‌లోనే నిలిచిపోయింది. ఇప్పుడు డీ 1, డీ 3 ఫీల్డ్స్‌‌లో కూడా ఉత్పత్తి చివరి దశకు చేరింది. మార్చి 2010లో కేజీ డీ 6 అత్యధికంగా 69.43 మిలియన్‌‌ స్టాండర్డ్ క్యూబిక్‌‌ మీటర్ల ఉత్పత్తి సాధించడం విశేషం. ఆ తర్వాత నీరు, ఇసక వచ్చి బావులను కప్పివేశాయి.

తాజాగా ఆర్‌‌ క్లస్టర్‌‌, శాటిలైట్‌‌ క్లస్టర్‌‌, ఎంజే  పేరిట మూడు నిక్షేపాలను వెలికితీసే ప్రయత్నంలో ఉన్నట్లు కంపెనీ ఈ ప్రజంటేషన్‌‌లో వివరించింది. ఈ మూడూ కలిపి గరిష్టంగా 30–35 మిలియన్‌‌ స్టాండర్డ్‌‌ క్యూబిక్‌‌ మీటర్ల సహజవాయువు ఉత్పత్తి సాధించగలవనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్‌‌ క్లస్టర్‌‌ నుంచి సహజవాయువు ఉత్పత్తి 2020 మధ్య నాటికి అందుబాటులోకి వస్తుందని, ఆ తర్వాత 2021 మధ్య నాటికి శాటిలైట్‌‌ క్లస్టర్‌‌, 2022 నాటికి ఎంజే క్లస్టర్ ఉత్పత్తి మొదలవుతుందని పేర్కొంది. ఈ బ్లాకులో ఆర్‌‌ఐఎల్‌‌కు 60 శాతం వాటా, బీపీకి 30 శాతం వాటా, నీకో రిసోర్సెస్‌‌కు 10 శాతం వాటా ఉన్నాయి. ఐతే, చెల్లింపులను జరపడంలో విఫలమవడంతో నీకో రిసోర్సెస్ వాటాను ఆర్‌‌ఐఎల్‌‌, బీపీకి ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ జరుగుతోందని ఆర్‌‌ఐఎల్‌‌ ప్రజంటేషన్‌‌లో తెలిపింది.