
న్యూఢిల్లీ: క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఈ నెల 24న అమెరికాకు వెళ్లనున్న ప్రధాని మోడీకి ఓ టెర్రర్ గ్రూప్ వార్నింగ్ ఇచ్చింది. మోడీ యూఎస్‌కు వస్తే నిద్ర లేకుండా చేస్తామని ఖలిస్థాన్ టెర్రర్ గ్రూప్ అయిన సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) హెచ్చరించింది. మోడీ విజిట్ సమయంలో వైట్ హౌస్ ఎదుట నిరసనలకు దిగుతామని ఎస్‌ఎఫ్‌జే జనరల్ కౌన్సెల్ గుర్‌పత్వంత్ సింగ్ పన్నూన్ అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్న రైతులతో మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు తమకు నచ్చడం లేదని.. అందుకే ప్రధాని పర్యటనలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగబోతున్నట్లు గుర్‌పత్వంత్ తెలిపారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. క్వాడ్ సమ్మిట్‌లో మోడీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ పీఎం యోషిహిడే సుగా కూడా పాల్గొననున్నారు.
ఎస్‌ఎఫ్‌జే టార్గెట్ ఏంటి?
సెక్యూరిటీ గ్రిడ్ సమాచారం ప్రకారం.. ఎస్‌ఎఫ్‌జే పెద్ద సంస్థ కాదు. భారత్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడానికి ఈ సంస్థ వాట్సాప్ వేదికగా పలు గ్రూప్‌లను నిర్వహిస్తోంది. వీటిల్లో పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్లు పలువురు ఉన్నారు. మోడీ యూఎస్ విజిట్‌కు అడ్డంకులు సృష్టించేందుకు ఈ సంస్థ పలువుర్ని సమాయత్తం చేస్తోందని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలిసింది. పలు సంవత్సరాలుగా యాక్టివ్‌గా ఉన్న ఈ సంస్థ.. డార్క్ వెబ్ ద్వారా అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేస్తోందని సమాచారం. యాంటీ ఇండియా కార్యకలాపాలను వేగవంతం చేయడంలో భాగంగా యువతను ఆకర్షించేందుకు ఈ సంస్థ యత్నిస్తోందని తెలిసింది. విదేశాల్లో సిటిజన్‌షిప్ ఇప్పిస్తామంటూ యువతను ఆకర్షించి.. భారత్ వ్యతిరేక కార్యకాలాపాలకు ఎస్‌ఎఫ్‌జే ఉసిగొల్పుతున్నట్లు సమాచారం. దేశ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై 2019, జూలై 10న సిఖ్స్ ఫర్ జస్టిస్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించడం గమనార్హం.