కేజ్రీవాల్‪పై ఖలిస్థానీ సంచలన ఆరోపణలు రూ.133 కోట్లు లంచం ఇచ్చాం

కేజ్రీవాల్‪పై ఖలిస్థానీ సంచలన ఆరోపణలు రూ.133 కోట్లు లంచం ఇచ్చాం

ఆప్ అధినేత ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ సోషల్ మీడియాతో  కేజ్రీవాల్ పై  సంచలన ఆరోపణలు చేశాడు.   సిక్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్‌గా కెనడా నుంచి ఖలిస్థాన్ వేర్పాటువాదాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఖలిస్థానీ వేర్పాటువాదుల నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడని గురుపత్వంత్ సింగ్ పన్నున్ సోషల్ మీడియా పోస్ట్ చేసిన ఓ వీడియోలో అన్నారు. 2014 నుంచి 2022 మధ్య కాలంలో ఖలిస్థానీ గ్రూప్‌ల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.133 కోట్ల నిధులు ముట్టాయని తెలిపాడు. తమకు ఆర్థిక సాయం అందిస్తే టెర్రరిస్ట్ దేవీందర్ పాల్ సింగ్ భుల్లార్ ని విడుదల చేస్తామని డీల్ కుదుర్చుకున్నట్టు సంచలన విషయం చెప్పాడు. 1993 ఢిల్లీ బాంబు పేలుడు కేసులో భుల్లార్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ టెర్రరిస్ట్‌ని విడిచిపెడతామని కేజ్రీవాల్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్టు పన్నున్ ఆరోపించాడు. 

2014లో అరవింద్ కేజ్రీవాల్, ఖలిస్థాన్ మద్దతుదారులు కొందరు న్యూయార్క్‌లోని రిచ్‌మండ్‌ హాల్‌లో గురుద్వారలో భేటీ అయ్యారని, అక్కడే ఆర్థిక సాయం అడిగాడని గురుపత్వంత్  సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఈ సంచలన విషయాలు చెప్పాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన ఈ సమయంలో వీడియో విడుదల చేసి సంచలనం సృష్టించాడు.  కేజ్రీవాల్‌పై పన్నున్ ఇలా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఖలిస్థాన్ గ్రూప్‌ల నుంచి ఆప్‌కి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని గతంలోనూ చెప్పాడు. కేజ్రీవాల్‌పైనే కాదు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పైనా ఇవే ఆరోపణలు చేశాడు. కెనడా, అమెరికాకి చెందిన ఖలిస్థాన్ గ్రూప్‌ల నుంచి వీళ్లకి పెద్ద ఎత్తు నిధులు అందినట్టు చెప్పాడు. పంజాబ్‌లో కొంత మంది ఖలిస్థాన్‌ వేర్పాటువాదుల్ని అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాళ్లని విడుదల చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గురుపత్వంత్  ఆప్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.