- రాహుల్ మీద మోదీ సెటైర్ పై ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశంలో పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించడం చేతకాని ఎన్డీయేకు అధికారంలో కొనసాగే అర్హత లేదని కాంగ్రెస్ చీఫ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అమానుషమన్నారు. లాఠీఛార్జ్‌లతో యువత గొంతు నొక్కేయలేరని మండిపడ్డారు.
సోమవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకాగా.. ఇటీవల మరణించిన ప్రముఖులకు రాజ్యసభలో చైర్మన్ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఖర్గే మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ కుంభకోణంపై ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించడంలేదని మండిపడ్డారు.
ప్రవేశ పరీక్షల్లో వరుస పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువతపై దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించడం చేతకాకపోతే తక్షణమే పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
56 అంగుళాల ఛాతీ ఏమైంది..?
సభ వాయిదా పడిన అనంతరం పార్లమెంట్ బయట ఖర్గే మీడియాతో మాట్లాడారు. అయోధ్య రామమందిర నిధుల సేకరణలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ‘చందా’ల పేరుతో భక్తుల డబ్బును దోచుకున్నారని విమర్శించారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది ప్రధాని మోదీనే కాబట్టి.. అక్రమాలకూ ఆయనే బాధ్యత వహించాలని ఖర్గే డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ వయసును ప్రస్తావిస్తూ మోదీ పరోక్షంగా సెటైర్లు వేయడంపైనా ఖర్గే మండిపడ్డారు. ఇతరులను ఎద్దేవా చేయడం, కించపరిచేలా మాట్లాడటమే మోదీ ప్రధాన పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ‘‘ముందు ప్రజలకు మీ స్వంత విశ్వసనీయతను నిరూపించుకోండి, మీ ‘56 అంగుళాల ఛాతీ’ ఏమైంది?’’ అని మోదీని ఖర్గే ప్రశ్నించారు.
