తొలిరోజే ఖర్గే కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్ కమిటీ

తొలిరోజే ఖర్గే కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్ కమిటీ

కాంగ్రెస్ జాతీయ  అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే తొలిరోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. 47 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ సహా జీ23 సభ్యులకూ ఈ కమిటీలో చోటు కల్పించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్ కమిటీ పనిచేయనుంది. స్టీరింగ్ కమిటీ ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ సభ్యులు ఇవాళ ఉదయమే రాజీనామా  చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుబ్బరామిరెడ్డికి ఈ కమిటీలో చోటు దక్కింది. 

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ఇవాళే బాధ్యతలు చేపట్టారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక సమక్షంలో జాతీయాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. 24ఏళ్ళ తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి మొదటిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. కర్ణాటకకు చెందిన మల్లిఖార్జున్ ఖర్గే 27 ఏళ్ళ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1972లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.  10సార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించిన ఆయన... 2009 నుంచి 2019 వరకూ లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు ఆయన రాజ్యసభలో విపక్షనేతగా ఉన్నారు.  

తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఖర్గే కృతజ్ఞతలు తెలియజేశారు. తనను సామాన్య స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చింది పార్టీనేనన్నారు. పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే తన ముందున్న లక్ష్యమని వెల్లడించారు. బాధ్యతల నిర్వహణలో ప్రతిఒక్కరి సహకారం తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.