
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజల గొంతును వినిపించారని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మోదీ ప్రభుత్వానికి ప్రజల బాధలు కనబడటం లేదా? రాజకీయాలు చేసి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా ఉన్నారా అని ప్రశ్నించారు. బీజేపీకి ఇతరుల బాధలు అర్థం చేసుకోలేని మనసు ఉండటం వల్లే మణిపూర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘లోక్‌సభలో రాహుల్ గాంధీ దేశ ప్రజల వాయిస్‌ని వినిపించారు. భారత మాత ఇండియా ప్రజలకే చెందినదని పండిట్ నెహ్రూ చెప్పారు. మణిపూర్‌లో మన బ్రదర్స్, సిస్టర్స్ హింసను ఎదుర్కొంటున్నారు. బీజేపీ వల్ల వారు బాధపడుతున్నారు. మోదీజీ మీ మంత్రులు అక్కడక్కడా మాట్లాడు తున్నారు కానీ, అక్కడ హింస ఎలా జరిగింది? ఎందుకు వ్యాప్తి చెందిందో చెప్పడం లేదు. మణిపూర్‌లో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ప్రధాని మోదీ ఎందుకు విజ్ఞప్తి చేయడం లేదు. అక్కడికి వెళ్లి ప్రజల బాధలను తెలుసుకోవాలని మంత్రులకు ఎందుకు చెప్పడం లేదు”అని బుధవారం ట్విట్టర్‌లో ప్రశ్నించారు.