- అడ్డుకొని ఆట వస్తువులు తొలగించిన హైడ్రా
- హైకోర్టు ఆదేశాలతోనే చర్యలు తీసుకున్నామన్న అధికారులు
అంబర్పేట్, వెలుగు: హైకోర్టు ఆదేశాల మేరకు అంబర్‌పేట బతుకమ్మ కుంట వద్ద ఏర్పాటు చేసిన చిన్న పిల్లల ఆట వస్తువులు, ఓపెన్ జిమ్‌ను హైడ్రా సిబ్బంది బుధవారం తొలగించారు. ఉదయమే భారీ బందోబస్తుతో అక్కడికి చేరుకున్న సిబ్బంది ఒక్కొక్కటిగా సామాగ్రిని తొలగించడం ప్రారంభించారు.
తొలగింపు ప్రక్రియను గమనించిన స్థానిక చిన్నారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని హైడ్రా సిబ్బందిని అడ్డుకున్నారు. ‘‘ఒకప్పుడు ఇక్కడ నిలబడలేకపోయాం... ఇప్పుడు మంచిగా ఆడుకుంటున్నాం.. మేము ఆడుకునే పార్కును తొలగించొద్దు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
సిబ్బంది వెనక్కి తగ్గకపోవడంతో కొందరు పిల్లలు అడ్డుగా నిలబడగా, హైడ్రా సెక్యూరిటీ వారిని కట్టడి చేసింది. హైకోర్టు తీర్పు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
