మళ్లీ యుద్ధమా..? : రైల్లో రష్యా వెళ్లిన కిమ్.. పెద్ద ప్లాన్ అంటున్న ప్రపంచం..

మళ్లీ యుద్ధమా..? : రైల్లో రష్యా వెళ్లిన కిమ్.. పెద్ద ప్లాన్ అంటున్న ప్రపంచం..

ప్రపంచంలో మరో కీలక పరిణామం జరిగింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. తన సొంత రైలు.. బుల్లెట్ ఫ్రూఫ్ రైలులో రష్యా చేరుతున్నారు. తరతరాలుగా కిమ్ ఫ్యామిలీ చైనా, రష్యా వెళ్లాలంటే ఈ రైలునే ఉపయోగిస్తుంది. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు కిమ్.. ప్రత్యేక రైలులో రష్యాకు వెళ్లారు. తనతోపాటు విదేశాంగ మంత్రి, ఇద్దరు సైనిక ఉన్నతాధికారులు, పీపుల్స్ ఆర్మీ మార్షల్స్, తన దేశ మీడియా బృందంతో రష్యాలోకి ఎంటర్ అయ్యారు.

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ రైలు రష్యాలోకి ప్రవేశించినట్లు రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. రియా నోవోస్తీ మంగళవారం ప్రచురించిన ఒక నివేదికలో ముదురు ఆకుపచ్చ క్యారేజీలతో కూడిన రైలును రష్యన్ రైల్వేస్ లోకోమోటివ్ ఉత్తర కొరియా నుంచి ప్రిమోర్స్కీ ప్రాంతంలోకి ప్రవేశించిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కిమ్ భేటీ కానున్నట్లు రష్యా మీడియా తెలిపింది.

కిమ్ జోంగ్ ఉన్ ప్రతినిధి బృందంలో అతని విదేశాంగ మంత్రి చో సన్ హుయ్, అతని ఇద్దరు సైనిక అధికారులు, కొరియన్ పీపుల్స్ ఆర్మీ మార్షల్స్ రి ప్యోంగ్ చోల్, పాక్ జోంగ్ చోన్ కూడా ఈ రైల్లో ఉన్నారని అసోసియేటెడ్ ప్రెస్ ఓ ప్రత్యేక నివేదికలో తెలిపింది. కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా వెలుపల అడుగు పెట్టడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి.

ఇక కిమ్, పుతిన్ తో బేటీ కానున్న క్రమంలో.. వారిద్దరూ ఏయే అంశాలపై చర్చిస్తారన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఫిరంగి షెల్స్, ఇతర క్షిపణులను రష్యన్ సైన్యానికి సాయం చేయమని రష్యా అడగనున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా కిమ్.. అధునాతన ఉపగ్రహం, అణుశక్తితో నడిచే జలాంతర్గామి సాంకేతికతను కోరతారని, అంతకంటే ముఖ్యంగా తన దేశానికి ఆహార సహాయాన్ని కోరుకోనున్నట్టు సమాచారం.