రాహుల్ గాంధీ స్పీచ్ అబద్ధాలమయం..ఆధారాలు చూపించాలి..కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

రాహుల్ గాంధీ స్పీచ్ అబద్ధాలమయం..ఆధారాలు చూపించాలి..కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం చేసిన ప్రసంగమంతా అబద్ధాలతో నిండిపోయిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. ఆయన అబద్ధాలను సభ రికార్డుల నుంచి తొలగించాలని కోరతామన్నారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో రిజిజు మాట్లాడారు. 

కేంద్రం ఇండియాను అమ్మేసిందన్న రాహుల్ కామెంట్లను ఖండించారు. ‘‘ఇండియాను ఎవరూ అమ్మలేరు. ఎవరూ కొనలేరు. 2011–12లో ఇండియా ఐదు బలహీనమైన ఎకానమీల్లో ఒకటిగా ఉండేది. కానీ ఇప్పుడు 4వ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. త్వరలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారుతుంది” అని చెప్పారు. 

‘‘సభలో మాట్లాడిన అంశాలపై ప్రతిపక్ష నేతను ఆధారాలు అడగాలని స్పీకర్​కు నోటీస్ ఇస్తాం. రాహుల్ అబద్ధాలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తాం. ఆధారాలు ఇస్తానని రాహుల్ చెప్పారు కానీ  ఇవ్వలేరు. ఎందుకంటే అవన్నీ అబద్ధాలే” అని అన్నారు. 

సభలో అబద్ధాలు మాట్లాడటం, ఆ వెంటనే సభ నుంచి వెళ్లిపోవడం రాహుల్​కు అలవాటుగా మారిందని రిజిజు ఫైర్ అయ్యారు. సంబంధిత మంత్రి చెప్పే జవాబు వినకుండా సభ నుంచి వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. కాగా,  రాహుల్ కామెంట్లపై బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ.. కాంగ్రెస్​లో రాహుల్ అత్యంత తెలివైన మూర్ఖుడని మండిపడ్డారు. ఆయన తీరు పార్లమెంటరీ ప్రమాణాలను దిగజారుస్తోందని విమర్శించారు.