సరిగ్గా ఆలోచించండి.. పాక్‎తో ఆడకపోతే మనకే నష్టం: ఇండియా, పాక్ మ్యాచ్‎పై కేంద్రమంత్రి రిజిజు క్లారిటీ

సరిగ్గా ఆలోచించండి.. పాక్‎తో ఆడకపోతే మనకే నష్టం: ఇండియా, పాక్ మ్యాచ్‎పై కేంద్రమంత్రి రిజిజు క్లారిటీ

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‎తో అన్ని సంబంధాలు తెంచుకున్న భారత్.. దాయాది దేశంతో క్రికెట్ ఆడేందుకు మాత్రం అనుమతి ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆసియా కప్‎లో పాక్‎తో మ్యాచ్‎ను బాయ్‎కాట్ చేయాలని సాధారణ ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. ఇండియా, పాక్ మ్యాచ్ రోజు అయితే సోషల్ మీడియాలో బాయ్‎కాట్ ఇండియా, పాక్ మ్యాచ్ అనే హ్యాష్‎ట్యాగ్ ట్రెండ్ అయ్యింది.

అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా పాక్‎తో మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్‎తో టీమిండియా మ్యాచ్ ఆడి విజయం సాధించింది. ఈ క్రమంలో ఆసియా కప్‎లో పాక్‎తో మ్యాచ్ ఆడేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి గల కారణాలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు క్లారిటీ ఇచ్చారు. సోమవారం (సెప్టెంబర్ 15) ముంబైలో కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా పాకిస్తాన్‎తో విడిగా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‎లు ఆడటం లేదని.. కేవలం ఆసియా కప్, ఐసీసీ టోర్నీల వంటి బహుపాక్షిక టోర్నమెంట్‌లో మాత్రమే ఆడుతోందని క్లారిటీ ఇచ్చారు. 

►ALSO READ | Asia Cup 2025: హాంకాంగ్‌కు డూ ఆర్ డై.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో కూడా పాకిస్థాన్‎తో ఆడొద్దనుకుంటే ఇండియా టోర్నీ నుంచి మొత్తమే తప్పుకోవాల్సి ఉంటుందని.. ఓవరాల్‎గా ఆ నిర్ణయం ఇండియాకే నష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతోన్న ఆసియా కప్‌లో కూడా పాక్‎తో ఆడకపోతే ఇండియా టోర్నీ నుంచి ఔట్ అవుతుంది. ఫలితంగా మనమే బాధపడాల్సి ఉంటుందన్నారు.

ఒక దేశంతో మనకున్న శత్రుత్వం కారణంగా మనం ఐసీసీ వరల్డ్ కప్, ఒలింపిక్స్‌ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్స్‎కు వెళ్లకపోతే చివరకు ఎవరు నష్టపోతారని ప్రశ్నించారు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. సెంటిమెంట్ ఉండటం కరెక్టే.. కానీ సెంటిమెంట్ వెనుక ఒక హేతుబద్ధమైన ఆలోచన ఉండాలని పేర్కొన్నారు.