‘కిసాన్ క్రెడిట్ కార్డ్ ’.. ప్రయోజనాలు మస్తు

‘కిసాన్ క్రెడిట్ కార్డ్ ’.. ప్రయోజనాలు మస్తు

రైతులు అర్హులు తక్కువ వడ్డీతో రుణాలు
18నుంచి 70ఏండ్ల రైతులు అర్హులు

కేశంపేట, వెలుగు : రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతుల అవసరాల కోసం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డ్ తో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేటు వ్యక్తుల వద్ద రైతులు అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉద్యోగులు, వ్యాపారులకు ఇస్తున్న క్రెడిట్ కార్డులను అన్నదాతలకు కూడా అందుబాటులోకి తేవాలని కేంద్రం సంకల్పించింది. వారి కోసం కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీపీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులకు కిసాన్ క్రిడిట్ కార్డు వరంగా మారనుంది.

భూమి ఉండి 18నుంచి 70 ఏండ్లలోపు వయస్సు ఉన్న రైతులందరూ ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్ ను సంప్రదించి కార్డును పొందొచ్చు. కామన్ సర్వీస్ సెంటర్, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు పత్రాలు లభిస్తాయి. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డుతోపాటు పట్టాదారు పాసుపుస్తకం తీసుకెళ్లి బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకులు ఐదేళ్ల కాలపరిమితితో కార్డులను జారీ చేస్తాయి. రెండున్నర ఎకరాల భూమి ఉన్నవారు రూ.2లక్షల వరకు, అంతకన్న ఎక్కువగా ఉన్న రైతులు రూ.3లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఏడుశాతం వడ్డీతో రుణం ఇస్తారు. సకాలంలో చెల్లిస్తే వడ్డీలో రాయితీ కూడా ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డుతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర పరికరాలను కొనుగోలు చేయవచ్చు. 45రోజుల్లో చెల్లిస్తే వడ్డీ కూడా ఉండదు. కార్డు ఉన్న వాళ్లందరికీ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని అమలు చేస్తారు.

 రైతులకు ఉపయోగం

ప్రైవేటు వ్యక్తుల వద్ద రైతులు అప్పు చేసి అధిక వడ్డీ భారంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులు రైతులకు కూడా జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో రైతులకు చాలా ఉపయోగం కలగనుంది. అవసరమైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి.                                                                                                                      – శిరీష, ఏఓ, కేశంపేట మంజూరు