- సవరణలు జరిగితే ఎస్సీ స్థానాలు 84 నుంచి 140కి పైగా పెరిగే చాన్స్
- మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ.. రూ.7 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం
- జీడీపీ ఆధారంగా సీట్ల పెంపు ‘పిచ్చి ప్రపోజల్’: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం సోమాజిగూడలోని జయ గార్డెన్స్‌లో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల ముగింపు సదస్సులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, స్టాలిన్ వంటి నాయకులు మూర్ఖపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రానికీ వివక్ష లేకుండా దేశవ్యాప్తంగా సమాంతరంగా సీట్లు పెంచాలన్నదే ప్రధాని మోదీ సంకల్పమన్నారు. ఒకవేళ సవరణలు సజావుగా సాగితే ప్రస్తుతం ఉన్న 84 ఎస్సీ స్థానాలు 140కి పైగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కానీ, చట్టసభల్లో మహిళలు, దళితులు, గిరిజనులు అడుగుపెట్టకుండా కాంగ్రెస్ దశాబ్దాలుగా అడ్డుపడుతోందన్నారు. రిజర్వేషన్ల ఫలాలను అందకుండా చేయడం కాంగ్రెస్ నైజమని, 70 కోట్ల మంది మహిళలకు ఆ పార్టీ అన్యాయం చేసిందని విమర్శించారు.
రూ.7 వేల కోట్ల ప్రాజెక్టులకు మోక్షం..
మే 10న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. సుమారు రూ.7 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, జాతీయ రహదారుల విస్తరణతో పాటు ఉపాధి కల్పించే జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూమిపూజ చేస్తారన్నారు. పర్యటన ముగింపులో పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
జీడీపీ ప్రపోజల్‌తో కొడంగల్ సీటే ఉండదు: బండి సంజయ్
జీడీపీ ఆధారంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పెంచాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ఒక ‘పిచ్చి ప్రపోజల్’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి వేస్తున్న ట్రాప్‌లో చిక్కుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ ప్రతిపాదన అమలు చేస్తే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 70 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుందని, అప్పుడు రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ సీటే గల్లంతవుతుందని వెల్లడించారు. ములుగు, కొమరం భీం వంటి వెనుకబడిన జిల్లాలకు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం ఉండదన్నారు.
అంబేద్కర్ చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలకు 2 గజాల జాగా ఇవ్వని నీచ చరిత్ర కాంగ్రెస్‌ది అన్నారు. చివరకు ఆయన పార్థివ దేహాన్ని ముంబై తరలిస్తే, ఆ విమాన ఛార్జీల బిల్లును ఆయన భార్యకు పంపిన దౌర్భాగ్యపు పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీలు తమకు తాము భారతరత్న ఇచ్చుకున్నారని, కానీ అంబేద్కర్‌కు ఇవ్వకుండా ద్రోహం చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ మాత్రమే అంబేద్కర్ కలలు గన్న సామాజిక న్యాయాన్ని నిజం చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, లంకల దీపక్ రెడ్డి పాల్గొన్నారు.

