- 40 లక్షల టన్నుల బొగ్గు ఆదృశ్యమైనట్టు మీడియాలో కథనాలు
- ఇప్పటికే రూ.51,500 కోట్ల బకాయిలతో ఒత్తిడిలో సింగరేణి
- చర్యలు తీసుకోకపోతే సంస్థ ప్రయోజనాలకు విఘాతం
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ చేయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సీఎం రేవంత్‌ను కోరారు. నిజానిజాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే సింగరేణి ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. ఈమేరకు శనివారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సింగరేణి పాత్ర కీలకమన్నారు. అంతేకాకుండా ఈ సంస్థ ద్వారా 40 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని గుర్తు చేశారు. ‘సింగరేణి సంస్థలో సుమారు రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యమైందని ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. దీనివల్ల సంస్థకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.51,500 కోట్లకు పైగా బకాయిల కారణంగా సింగరేణి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది.
- ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకమైన వార్తలు సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని మరింతగా దెబ్బతీసే ప్రమాదం ఉంది’ అని ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలేంటో తేల్చాలని కేంద్రమంత్రి సూచించారు. సింగరేణిలో అంతర్గత నిర్వహణ సామర్థ్యాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పాటు ‘టెక్నాలజీ బేస్డ్ మానిటరింగ్’ పద్ధతులను వినియోగించాలని సూచించారు. తరుచూ సమీక్షలు నిర్వహించడం ద్వారా లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి, పరిష్కరించేందుకు అవకాశముంటుందని కిషన్రెడ్డి చెప్పారు. ఈ దిశగా ప్రత్యేక చొరవతీసుకోవాలని సీఎం రేవంత్కు కేంద్రమంత్రి సూచించారు.
