ఎన్నికలకు రెడీ కావాలి.. బీజేపీ క్యాడర్‌‌‌‌కు కిషన్‌‌రెడ్డి పిలుపు

ఎన్నికలకు రెడీ కావాలి.. బీజేపీ క్యాడర్‌‌‌‌కు కిషన్‌‌రెడ్డి పిలుపు
  • బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ డీఎన్ఏ ఒక్కటేనని విమర్శ
  • కష్టపడితే అధికారం మనదే: ప్రకాశ్ జవదేకర్
  • పార్టీ ఆఫీసు బేరర్ల మీటింగ్‌‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్, వెలుగు: షెడ్యూలు ప్రకారమే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ క్యాడర్‌‌‌‌ను ఎన్నికలకు సమాయత్తం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి. ఈ మూడు పార్టీల డీఎన్ఏ ఒక్కటే. హిందూ వ్యతిరేకతే వాటి విధానం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌కు ఓటు వేస్తే కాంగ్రెస్‌‌కు వేసినట్టే. కాంగ్రెస్‌‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌‌కు వేసినట్టే. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే మజ్లిస్ ఆధిపత్యానికి ఓటు వేసినట్టే. ఎన్నికల తర్వాత ఈ పార్టీలు ఒక్కటవడం ఖాయం” అని ఆరోపించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన ఆఫీసు బేరర్ల మీటింగ్‌‌లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మధ్యప్రదేశ్ రాష్ట్ర పార్టీ ఇన్‌‌చార్జ్‌‌ మురళీధర్ రావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఇంద్రసేనా రెడ్డి, రాష్ట్ర ఆఫీసు బేరర్లు, జిల్లాల అధ్యక్షులు, జిల్లాల ఇన్‌‌చార్జ్‌‌లు పాల్గొన్నారు. 

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ్ నిధి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈనెల 11న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ఈనెల 13న 24 గంటల పాటు ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 15న సాయుధ పోరాట వీరులను స్మరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇదే రోజున కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి పరకాలలోని అమరధామం వరకు బైక్ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. తర్వాత అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవల ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటించి రిపోర్టును అధిష్టానానికి అందించారు. వారు ఇచ్చిన రిపోర్ట్ పై కూడా ఈ సమావేశంలో చర్చించారు. తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ, రాచరిక పార్టీలకు, అవినీతి ప్రభుత్వాలకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని కిషన్‌‌రెడ్డి అన్నారు.

ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు: ప్రకాశ్ జవదేకర్

రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ ఎన్నికల ఇన్‌‌చార్జ్‌‌ ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. పార్టీ నాయకులు కష్టపడితే అధికారం మనదేనన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తున్నారని  చెప్పారు. ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయని, నేతలు నియోజకవర్గాల్లో ప్రజల మధ్యనే ఉండాలన్నారు. 

పార్టీ కార్యక్రమాలను సక్సెస్​ చేయాలి: బన్సల్

జాతీయ పార్టీ సూచించిన ప్రోగ్రామ్ లను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కో ఇన్‌‌చార్జ్‌‌ సునీల్ బన్సల్ సూచించారు. బూత్ కమిటీలను బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై పోరును తీవ్రం చేయాలని పిలుపునిచ్చారు. 

17న పరేడ్ గ్రౌండ్‌‌లో సభ

ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అదే రోజు ఉదయం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తర్వాత పరేడ్ గ్రౌండ్‌‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. 

26, 27, 28 తేదీల్లో రథయాత్రలు

ఈ నెల 26, 27, 28 తేదీల్లో రాష్ట్రంలో రథయాత్రలు ప్రారంభం కానున్నాయి. బాసర నుంచి హైదరాబాద్ వరకు ఒక యాత్ర, సోమశిల నుంచి హైదరాబాద్ వరకు మరో యాత్ర, భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు ఇంకో యాత్ర కొనసాగనుంది. బాసర నుంచి ప్రారంభించనున్న యాత్రకు కిషన్ రెడ్డి సారథ్యం వహించనుండగా, సోమశిల నుంచి ప్రారంభించనున్న యాత్రకు డీకే అరుణ నాయకత్వం వహించనున్నారు. భద్రాచలం నుంచి కొనసాగనున్న యాత్ర ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో సాగనుంది. 

మూడు యాత్రలు వచ్చే నెల 14 న హైదరాబాద్ చేరుకోనున్నాయి. ముగింపు యాత్రకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నది. బాసర జోన్‌‌లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు.. సోమశిల జోన్‌‌లో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు, భద్రాచలం జోన్‌‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. 19 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర ఈ యాత్రలు సాగనున్నాయి.