- ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలి: కిషన్ రెడ్డి
- సింగరేణి ప్రైవేటీకరణ లేదు.. సంస్థలో దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి
- 12 ఏండ్లుగా సింగరేణి దోపిడీకి గురవుతోందని ఆరోపణ
- కార్మికులతో ముఖాముఖిలో కేంద్ర మంత్రి
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో అక్రమాలపై సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఏరియాలోని పీవీకే 5 ఇంక్లైన్ మైన్‌లో ఆయన పర్యటించారు. సింగరేణి ఇన్‌చార్జి సీఎండీ కృష్ణ భాస్కర్, డైరెక్టర్లతో కలిసి అండర్ గ్రౌండ్ మైన్‌లోకి దిగి, పని ప్రదేశాలను పరిశీలించారు. కార్మికులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా సింగరేణి సంస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సింగరేణిలో దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని, నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
గత 12 ఏండ్లుగా సింగరేణి దోపిడీకి గురవుతుందని ఆరోపించారు. సింగరేణి ప్రైవేటీకరణ లేదని ఆయన స్పష్టం చేశారు. సింగరేణిలో మహిళలు పనిచేస్తుండడం అభినందనీయమన్నారు. జీరో యాక్సిడెంట్స్ దిశగా సింగరేణి పయనించాలని, ప్రమాదాల నివారణకు ఎంతైనా ఖర్చు పెడ్తామని చెప్పారు. దేశంలోని 4 లక్షల మంది బొగ్గు గని కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని తెలిపారు. బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని, ఇన్‌కం ట్యాక్స్ తగ్గింపుపై సంబంధిత శాఖతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.
కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంది..
పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకున్నదని కిషన్ రెడ్డి అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో బీజేపీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. దోచుకున్న డబ్బులను పంచుకోవడంలోనే కేసీఆర్ కుటుంబం రోడ్డున పడ్డదన్నారు. రేవంత్ పాలన కూడా బీఆర్‌ఎస్ తరహాలోనే సాగుతోందని విమర్శించారు. హామీల అమలును మర్చిపోయారన్నారు.
బీఆర్‌ఎస్‌కు డూప్‌గా కాంగ్రెస్ పార్టీ మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్ముక్కై తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.
ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. అంతకు ముందు బీఎంఎస్ యూనియన్ ఆఫీసులో జరిగిన కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా బీఎంఎస్ ఎదగాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎన్నికల ఇన్‌చార్జి ధర్మారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు జీవీకే మనోహర్, కేవీ రంగాకిరణ్, బీఎంఎస్ జాతీయ నేత మాధవ్ నాయక్ పాల్గొన్నారు.
