గత ప్రభుత్వాన్ని తిట్టుడు తప్ప.. మీరిచ్చిన హామీల సంగతేంది: కిషన్ రెడ్డి

గత ప్రభుత్వాన్ని తిట్టుడు తప్ప.. మీరిచ్చిన హామీల సంగతేంది: కిషన్ రెడ్డి
 
  • అంతా మాటల గారడీ
  •     ఎన్నికల ముందు ప్రకటించిన డిక్లరేషన్లు అన్నీ చెత్తబుట్టలోకేనా? 
  •     15 శాతమున్న మైనార్టీలకు 2 వేల కోట్లు.. 50 శాతమున్న బీసీలకు 8 వేల కోట్లేనా?

హైదరాబాద్, వెలుగు:  కేసీఆర్ పాలన అంకెల గారడీ మాత్రమే అయితే.. కాంగ్రెస్ పాలన అంకెల గారడీతో పాటు మాటల గారడీ కూడా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై చెప్పిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ పై కిషన్ రెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘‘వ్యవసాయ రంగానికి రూ.19,746 కోట్లు కేటాయించారు. రైతు భరోసా, రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంట రుణాలు.. ఇలా వివిధ వ్యవసాయ రంగ కార్యక్రమాలకు ఈ బడ్జెట్ ఎలా సరిపోతుంది. కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా ఇస్తామన్నారు. అవన్నీ నీటి మీద రాతలేనా? ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అమలుకానట్టేనా?” అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. వరంగల్ లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ చిత్తు కాగితమేనని బడ్జెట్ చూస్తే అర్థమవుతోందని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధం చేస్తామని హామీ ఇచ్చి, దాన్ని కూడా తుంగలో తొక్కి బీసీలను మోసం చేశారని..  కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను చెత్తబుట్టలో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పట్టణాభివృద్ధికి 11 వేల కోట్లేనా? 

గ్రామ పంచాయతీ ఎన్నికలపై బడ్జెట్ లో ప్రస్తావన లేదని, అంటే ఈ ఏడాది నిర్వహించరా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో కూడా దశాబ్దాల పాటు ఎన్నికలు నిర్వహించని చరిత్ర కాంగ్రెస్ కు ఉందని విమర్శించారు. ‘‘పట్టణాభివృద్ధి కోసం రూ.11 వేల కోట్లే కేటాయించారు. మూసీ ప్రక్షాళన కోసం మజ్లిస్ నాయకుడు అక్బరుద్దీన్ తో కలిసి లండన్ వరకు పోయిన ముఖ్యమంత్రి.. ఒకసారి గుజరాత్ సబర్మతీ నది దగ్గరకు వెళ్తే సుందరీకరణ ఎట్ల చేయాలో అర్థమయ్యేది.15 శాతం ఉన్న మైనారిటీలకు రూ.2,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు మాత్రం రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం” అని మండిపడ్డారు. ‘‘సాగునీటి ప్రాజెక్టులకు రూ.28 వేల కోట్లు ఏమాత్రం సరిపోవు. 

గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వమూ చేస్తోంది. గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీకి కూడా ఈ నిధులు సరిపోవు. కృష్ణా నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు. కానీ నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి?” అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆర్భాటంగా ప్రకటించిన ‘యూత్ డిక్లరేషన్’ అమలు కోసం కూడా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. ‘‘విద్యారంగాన్ని కూడా విస్మరించారు. బడ్జెట్ లో యూనివర్సిటీల ఊసేలేదు. మొత్తంగా చూస్తే హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇది తెలంగాణకు కాంగ్రెస్  చేస్తున్న దారుణమైన మోసం” అని ఫైర్ అయ్యారు.